రైతులకు పెట్టుబడి ఖర్చుల విషయంలో కొంత ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో చెల్లిస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. వ్యవసాయ పనులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చుల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. అయితే, పథకంలో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన ప్రతి విడత డబ్బులు తప్పనిసరిగా అందుతాయని హామీ లేదు. లబ్ధిదారుల వివరాలు, అర్హత, పత్రాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నా, ధృవీకరణ ప్రక్రియ పూర్తికాకపోయినా చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే 25వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు ముందుగానే తమ వివరాలను తనిఖీ చేసుకోవాలి.

