Last Updated:
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే మారుతి సుజుకి ధరలు పెంచగా, ఇప్పుడు హ్యుందాయ్ కూడా కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి ఎంపిక చేసిన కార్ల ధరలను గరిష్టంగా రూ.8,000 వరకు పెంచనుంది. ఆడి కూడా జనవరి నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచగా, ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ 1, 2026 నుంచి తన కార్లలోని ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.8,000 వరకు ఈ పెంపు ఉండనుంది. వాహన తయారీకి అవసరమైన ముడిసరుకులు, ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఈ ధరల సవరణ గురించి వెల్లడించింది. అయితే అన్ని కార్ల ధరలు ఒకే విధంగా పెరగవు. మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల పెంపులో మార్పులు ఉంటాయి. గరిష్టంగా రూ.8,000 వరకు అదనపు భారం పడనుంది. ఏయే మోడళ్లపై ఎంత పెంపు ఉంటుందనే పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. కాబట్టి హ్యుందాయ్ కారు కొనాలనుకునేవారు డీలర్ల వద్ద ధరల వివరాలు తెలుసుకోవడం మంచిది.
కార్ల తయారీలో ఉపయోగించే స్టీల్, అల్యూమినియం, ఇతర కమోడిటీలు, విడిభాగాల ధరలు పెరగడం ఆటోమొబైల్ కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోంది. తయారీ, రవాణా ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఈ అదనపు వ్యయంలో ఎక్కువ భాగాన్ని తామే భరిస్తున్నప్పటికీ, కొంత మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని హ్యుందాయ్ తెలిపింది. ఖర్చులను తగ్గించేందుకు అంతర్గత సామర్థ్యాలను పెంచడం, ఇతర చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే హ్యుందాయ్ కార్ల ధరలు సుమారు 1.4 శాతం పెరిగాయి. ఇందులో సెప్టెంబర్‌లో చేసిన 0.4 శాతం పెంపు కూడా ఉంది. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్న తాజా పెంపు దీనికి అదనం.
పెరుగుతున్న ముడిసరుకు ధరలు కంపెనీ లాభాలపై ప్రభావం చూపుతున్నాయి. హ్యుందాయ్ రెండో త్రైమాసికంలో EBITDA మార్జిన్ గత ఏడాది 13.9 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. ఏకీకృత నికర లాభం కూడా ఏడాది ప్రాతిపదికన దాదాపు 24 శాతం పడిపోయింది. కమోడిటీ ఖర్చుల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.
మారుతి సుజుకి నవంబర్ 22 నుంచి ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచింది. ఈసారి సగటు ధరల పెంపు సుమారు 0.31 శాతంగా ఉంది. మరోవైపు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా జనవరి 1, 2027 నుంచి తన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలను గరిష్టంగా 2 శాతం పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులే ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆడి 2 శాతం వరకు ధరలు పెంచింది.
ప్రస్తుతం ఆడి పోర్ట్‌ఫోలియోలో A4, A6 సెడాన్లతో పాటు Q3, Q5, Q7, Q8 SUVలు ఉన్నాయి. SQ8, RS Q8 వంటి పనితీరు ఆధారిత మోడళ్లను కూడా విక్రయిస్తోంది. మొత్తంగా ప్రముఖ కంపెనీలు ధరలను సవరిస్తుండటంతో కొత్త కారు కొనాలనుకునేవారు తమ బడ్జెట్‌ను మరోసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. హ్యుందాయ్ కారు కొనాలనుకునేవారు డిసెంబర్ 1లోపు ప్రస్తుత ధరలు, అందుబాటులో ఉన్న ఆఫర్లను డీలర్ల వద్ద తెలుసుకోవచ్చు.

