విద్యారంగ పరిరక్షణకు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలే మార్గం
రూ.8,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి – పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, వంగూరి వెంకటేష్
ఖమ్మం, ప్రభ న్యూస్ , నవంబర్ 5 :
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి, విద్యార్థుల హక్కుల సాధనతో పాటు సమానత్వ సమాజ స్థాపన కోసం విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, వంగూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. విద్యార్థి అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్‌లో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి అమరవీరుల మహాసభలో వారు ప్రసంగించారు. 1960వ దశకం చివరిలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రజాస్వామిక, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పి.డి.ఎస్.యు ఆవిర్భవించిందని తెలిపారు. జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ తదితర విద్యార్థి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తోందని విమర్శించారు. విశ్వవిద్యాలయాలకు నిధుల కొరత, ఖాళీ పోస్టుల భర్తీ లేకపోవడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందకపోవడం ఉన్నత విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయన్నారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8,200 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.విద్యార్థులు నిరుద్యోగం, ఫీజుల భారం, కులవివక్ష, మతతత్వం, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలగకూడదని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థులను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా కోశాధికారి సురేష్, సహాయ కార్యదర్శి సాదిక్, జిల్లా ఉపాధ్యక్షుడు గాంధీ, రాము, పవన్, అనిల్, శ్రీను, కావ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

