Last Updated:
కొంచెం వెరైటీగా రాగులతో కరకరలాడే మురుకులు తయారు చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే రాగులతో చేసే ఈ చిరుతిండి రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మురుకులు చేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ బియ్యప్పిండి, శనగపిండితో చేసే మురుకులే కాకుండా.. ఈసారి కొంచెం వెరైటీగా రాగులతో కరకరలాడే మురుకులు తయారు చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే రాగులతో చేసే ఈ చిరుతిండి రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఈ మురుకుల తయారీకి ఒక కప్పు రాగులు, ఒకటిన్నర కప్పుల బియ్యం, అర కప్పు శనగ పుట్నాలు, రెండు కప్పుల కొబ్బరిపాలు, అర టీస్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల వెన్న, వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి. ముందుగా రాగులు, బియ్యం, శనగ పుట్నాలను విడివిడిగా శుభ్రంగా చూసుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించాలి. మరీ ఎక్కువ మంటపై వేయించకుండా తక్కువ లేదా మధ్యస్థ మంటపై కలుపుతూ వేయిస్తే పిండి మంచి వాసన వస్తుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తయారైన పిండిని జల్లెడ పట్టి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిలో వెన్న, వాము, తెల్ల నువ్వులు, ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి. తర్వాత కొబ్బరిపాలను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు పోయకుండా జాగ్రత్త పడాలి. మురుకులు ఒత్తడానికి వీలుగా పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఉండాలి. పిండి కలిపిన తర్వాత కొన్ని నిమిషాలు పక్కన ఉంచితే పదార్థాలన్నీ బాగా కలుస్తాయి.
తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టి మురుకులు వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. మురుకుల గొట్టం లోపల కొద్దిగా నూనె రాసి, అందులో సిద్ధం చేసుకున్న పిండిని పెట్టాలి. వేడి నూనెలో నేరుగా కాకుండా ముందుగా ఒక ప్లేట్‌పై లేదా పార్చ్‌మెంట్‌పై మురుకుల ఆకారంలో ఒత్తుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత వాటిని జాగ్రత్తగా వేసి మధ్యస్థ మంటపై దోరగా వేయించాలి. రెండు వైపులా సమానంగా కాలిన తర్వాత తీసి నూనె వడిపోయేలా జల్లెడపై ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసిన రాగి మురుకులు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.

