Last Updated:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే నాగార్జున N- కన్వేషన్ కూల్చివేత, ఆపై తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, ఇప్పుడు అదే తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవానికి నాగార్జున రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు ఇప్పుడు అత్యంత సుందరీకరణతో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, మురుగునీటితో దుర్వాసన వెదజల్లిన ప్రాంతాన్ని.. ఇప్పుడు పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో సరికొత్తగా ముస్తాబు చేశారు. చెరువుల పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా హైడ్రా చేపట్టిన పనులతో ఈ మార్పు సాధ్యమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 11వ తేదీన తమ్మిడికుంట చెరువును ప్రారంభించారు.
2 ఎకరాల భూమి ఇచ్చి తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. నాగార్జున గారు ముందుచూపుతో రాబోయే తరాల గురించి ఆలోచన చేసి, 2 ఎకరాల భూమి ఇచ్చారని.. సినిమాల్లోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా ఆయన హీరోలాంటి నిర్ణయం తీసుకున్నారని నాగార్జునను ఆకాశానికెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా చెరువు అభివృద్ధిలో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో గుడిసెలు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను కూడా అందజేశారు.
ఇకపోతే ఈ చెరువు అభివృద్ధి కోసం సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భాగంగా చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల మేర నడకదారి ఏర్పాటు చేశారు. ఆధునిక సౌకర్యాలతో ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ఆట స్థలాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు వచ్చే వారికి, వ్యాయామం చేసేవారికి, పిల్లలకు ఈ ప్రాంతం ఉపయోగపడనుంది. చెరువు పరిసరాల్లో వేలాది మొక్కలు నాటడంతో పచ్చదనం విస్తరించింది. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ తాజాగా అక్కినేని నాగార్జున చుట్టూ మరోసారి చర్చకు దారితీయడం కొసమెరుపు. ఈ చెరువు పునరుద్ధరణ వ్యవహారంలో తన ఎన్ కన్వెన్షన్ భూమిని కోల్పోయిన నాగార్జునకు లాభం జరిగిందా? లేక నష్టం జరిగిందా? అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కూల్చేశారు. ఆ సమయంలో నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేసినా, ఆ తర్వాత రంగనాథ్ తో మాట్లాడి మనసు మార్చుకున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు.
అయితే నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకు దీర్ఘకాలంలో ఆర్థికంగా బాగా కలిసొస్తుందనే అభిప్రాయాలు సోషల్ మీడియా వ్యక్తమవుతున్నాయి. నాగార్జున తనకు ఆస్తి నష్టం జరిగినా చట్టానికి, పర్యావరణ పరిరక్షణకు సహకరించడం వల్ల ఆయనకు గౌరవం పెరగడమే గాక, సుందరంగా తీర్చబడిన చెరువు, ఆ పక్కనే ఆయనకు మిగిలి ఉన్న N-కన్వెన్షన్ హాల్‌కు అద్భుతమైన ‘లేక్-వ్యూ’ వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జునకు మిగిలి ఉన్న N-కన్వెన్షన్ బ్రాండ్ వాల్యూ పెరగడమే కాకుండా ఎలాంటి చట్టపరమైన వివాదాలకు తావు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం కూడా లభిస్తుందని సోషల్ మీడియాలో అయితే చర్చలు నడుస్తున్నాయి.

