డేటమ్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన ‘ఇండియా ఫెస్టివ్ 2026’ నివేదిక ప్రకారం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి పెద్ద ఈ-కామర్స్ సంస్థలు పండుగల సేల్స్ ప్రారంభంలో మంచి స్పందన వచ్చిందని ప్రకటించాయి. అయినప్పటికీ మొత్తం మార్కెట్ వృద్ధి నెమ్మదించింది. ప్రతి ఏడాది ఈ సంస్థలు నిర్వహించే ఫెస్టివ్ సేల్స్ వల్లే పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతోంది. వీటికి తోడు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్, కంపెనీలు సొంతంగా నిర్వహించే వెబ్‌సైట్ల ద్వారా కూడా కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
సాధారణంగా పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో స్మార్ట్‌ఫోన్లకు పెద్ద వాటా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో మొత్తం పండుగల అమ్మకాలపై ప్రభావం పడింది. 2025లో మొత్తం పండుగల ఆన్‌లైన్ అమ్మకాల్లో మొబైల్ ఫోన్ల వాటా 35.2 శాతంగా ఉంది. ఈ ఏడాది అది 25 శాతానికి పడిపోయింది. ముందుగా 29.8 శాతం ఉంటుందని అంచనా వేసినా, అంతకంటే తక్కువగా నమోదైంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల సంఖ్య 25 నుంచి 33 శాతం వరకు తగ్గింది. అదే సమయంలో ఫోన్ల సగటు అమ్మకపు ధర మాత్రం 16 నుంచి 19 శాతం పెరిగింది. మెమరీ చిప్స్ ఖర్చులు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. ఫోన్ల ధరలు పెరగడంతో పాటు అమ్మకాల సంఖ్య తగ్గడంతో, స్మార్ట్‌ఫోన్ల ద్వారా వచ్చిన మొత్తం అమ్మకాల విలువ దాదాపు 15 శాతం పడిపోయింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో ఈ తగ్గుదల లేకపోయి ఉంటే, ఈ ఏడాది మొత్తం పండుగల ఆన్‌లైన్ అమ్మకాల వృద్ధి 17 శాతం కాకుండా దాదాపు 22 శాతంగా ఉండేదని డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
పెరిగిన డిమాండ్ ఉందంటున్న ఈ-కామర్స్ సంస్థలు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో సంస్థలు తమ పండుగల సేల్స్‌లో మంచి వృద్ధి నమోదైందని ప్రకటించాయి. అయితే ఈ సంస్థలు వెల్లడించిన గణాంకాలు వేర్వేరు కాలాలకు, వేర్వేరు లెక్కలకు సంబంధించినవి. నవంబర్ 3 నాటికి గత ఏడాది పండుగల సీజన్‌తో పోలిస్తే తమ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేసిన వస్తువుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగిందని అమెజాన్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన 11 రోజుల ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌లో ఆర్డర్లు, అమ్ముడైన వస్తువులు, కొనుగోళ్లు చేసిన కస్టమర్ల సంఖ్య 20 నుంచి 22 శాతం పెరిగినట్లు ప్రకటించింది.
మీషో నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సేల్’ మొదటి రోజే ఆర్డర్ల సంఖ్య 75 శాతం పెరిగింది. ఆర్డర్లు పెట్టిన కస్టమర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 60 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, మొత్తం ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్‌ను పరిశీలిస్తే వినియోగదారుల కొనుగోలు విధానంలో మార్పులు కనిపిస్తున్నాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వచ్చిన ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 75 శాతం పెరిగాయి. కంపెనీలు తమ సొంత వెబ్‌సైట్ల ద్వారా చేసిన అమ్మకాల్లో 27 నుంచి 30 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా వచ్చిన ఆర్డర్లు కేవలం 8 శాతమే పెరిగాయి. అంటే, వినియోగదారులు త్వరగా వస్తువులు అందించే క్విక్ కామర్స్ సేవల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని నివేదిక చెబుతోంది.
ప్రతి కొనుగోలుపై ఖర్చు తగ్గింది
ఆన్‌లైన్ అమ్మకాల సంఖ్య పెరిగినంత మాత్రాన వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేశారని చెప్పలేం. ఈ ఏడాది పండుగల సేల్స్‌లో ఇదే విషయం స్పష్టంగా కనిపించింది. సేల్స్ మొదటి 32 రోజుల్లో ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీల సంఖ్య 7 శాతం పెరిగింది. కానీ ఆ లావాదేవీల మొత్తం విలువ మాత్రం 6 శాతం తగ్గింది. 2025లో ఒక్కో కార్డ్ లావాదేవీకి సగటున రూ.6,830 ఖర్చు చేయగా, ఈ ఏడాది అది రూ.5,970కి పడిపోయింది. అంటే సగటు కార్డ్ పేమెంట్ 13 శాతం తగ్గింది. దీన్ని బట్టి వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ, ఒక్కోసారి ఖర్చు చేస్తున్న డబ్బును తగ్గించుకుంటున్నారని అర్థమవుతోంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయకుండా, తక్కువ ధర ఉన్న వస్తువులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ ఏడాది పండుగల సీజన్‌లో అమ్మకాల వేగం చివరి దశలో పెరిగింది. ముఖ్యంగా దీపావళి దగ్గరపడుతున్న కొద్దీ వినియోగదారులు ఎక్కువగా షాపింగ్ చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది నాలుగో వారం, చివరి నాలుగు రోజుల్లో కలిపి అమ్మకాల వృద్ధి 71 శాతంగా నమోదైంది. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది పండుగల ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగినా, వినియోగదారులు ఖర్చు చేసే మొత్తం తగ్గడం, స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు పడిపోవడం వల్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు క్విక్ కామర్స్, కంపెనీల సొంత వెబ్‌సైట్లకు ఆదరణ పెరుగుతోంది. అంటే ఆన్‌లైన్ షాపింగ్ కొనసాగుతున్నా, వినియోగదారులు ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే విషయంలో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి.
