Last Updated:
పాకిస్థాన్ నిఘా సంస్థ హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ దేశ రహస్య యుద్ధ ప్రణాళికలను లీక్ చేశాడు. అశ్లీల ఫొటోల కోసం సున్నితమైన సైనిక సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేసినట్లు ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
భారత వైమానిక దళానికి చెందిన ఒక వింగ్ కమాండర్ పాకిస్థాన్ నిఘా సంస్థ వలలో చిక్కుకుని అత్యంత రహస్య సైనిక పత్రాలు, యుద్ధ ప్రణాళికలను శత్రుదేశానికి చేరవేసినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయంతో హనీట్రాప్‌కు గురైన ఆ అధికారి, 2026 జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 మధ్య వాట్సాప్ ద్వారా పాక్ ఏజెంట్‌తో 3,008 మెసేజ్‌లు, 65 ఫొటోలు, 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
అవతలి మహిళ పంపిన ఒక అశ్లీల ఫొటోకు బదులుగా ‘రహస్య యుద్ధ ప్రణాళిక’ పత్రంలోని ఒక పేజీని పంపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక్కో నగ్న ఫొటో పంపితే యుద్ధ ప్రణాళికలోని కొత్త పేజీని పంపిస్తానని సదరు అధికారి ఆఫర్ ఇచ్చినట్లు ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేశారు.
కేవలం పత్రాలే కాకుండా అత్యంత రహస్య డ్రోన్ విభాగం సామర్థ్యం, పరీక్షలు, లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ వివరాలను కూడా ఆయన లీక్ చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. యుద్ధ సమయంలో సైన్యాన్ని మోహరించే ప్రాంతాలు, లేహ్‌లో యుద్ధ విమానాల స్థావరాలు, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన సైనిక విన్యాసాల సమాచారాన్ని పాక్ ఏజెంట్‌కు అందించాడు.
పాక్ ఏజెంట్ ఆదేశాల మేరకు ఆ వింగ్ కమాండర్ తన కింద పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది కమ్యూనికేషన్ పరికరాల్లో ప్రమాదకరమైన స్పైవేర్, మాల్‌వేర్ యాప్‌లను రహస్యంగా ఇన్‌స్టాల్ చేశాడు. దీనివల్ల వైమానిక దళ అంతర్గత సమాచారం శత్రువుల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడింది.
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా వల విసిరిన పాక్ మహిళ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారాడు. వాయుసేన అధికారుల ఫిర్యాదుతో 2026 మే 30న అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టయిన ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనతో రక్షణ రంగ సిబ్బంది సోషల్ మీడియా వాడకంపై నిఘా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.

