
సింగరేణి కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలి: కపిలవాయి దిలీప్ కుమార్
రైతు సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి..
సెప్టెంబర్ 26న జాబ్ మేళా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి దిగనున్నట్లు ప్రకటన


ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో, ఖమ్మం, జూలై 19 : సింగరేణి సంస్థలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు.ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలోని ఆర్‌ఎల్‌డీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ, బొగ్గు వనరులను కొందరు వాటాల వారీగా పంచుకుని దోచుకుంటున్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పెత్తనం కారణంగా సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు ఆందోళనకర స్థాయికి చేరాయని పేర్కొన్న ఆయన, రైతులను మోసం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 26న రాష్ట్ర స్థాయిలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ‘లక్ష్యం కోసం… లక్ష సైన్యం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాబోయే ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఈ సందర్భంగా కపిలవాయి దిలీప్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు ఆర్‌ఎల్‌డీ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సమావేశంలో ఆర్‌ఎల్‌డీ జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ మహమ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు మోత్కూరి వెంకటేశ్వర చారి, రాష్ట్ర అధికార ప్రతినిధి పి. వీరప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నర్సింహారావు, రాష్ట్ర కార్యదర్శి విశాల్, రాష్ట్ర కోశాధికారి గిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నోజు వెంకట రమణాచారి, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఇటుకల లత, జిల్లా నాయకురాలు బండి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
