ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు భరోసా: కలెక్టర్ దివాకర టీఎస్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడిపై దృష్టి సారించాలి.. నీటి వినియోగంపై పకడ్బందీ కార్యాచరణ
స్మార్ట్ రేషన్ కార్డులు, చేయూత పెన్షన్లు, వనమహోత్సవం, యూనిఫాం కుట్టు పనులను గడువులోగా పూర్తి చేయాలి
ప్రభ న్యూస్ ఖమ్మం ఆగస్టు 7:
రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల మార్పిడి విధానం ద్వారా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సేవల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పెన్షన్లు, పాఠశాల యూనిఫాంల కుట్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.
పంటల మార్పిడితో రైతులకు నష్టం తగ్గేలా చర్యలు
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని తెలిపారు.
భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన పంట కుంటలు, బోర్ రీచార్జ్, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి చౌకధరల దుకాణం పరిధిలో కార్డుల సంఖ్య, లబ్ధిదారుల వివరాలు, పంపిణీ తేదీ, సమయం, వేదిక, డీలర్ల వివరాలతో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ప్రతి పంపిణీ కేంద్రానికి బాధ్యత కలిగిన అధికారిని ఇన్‌చార్జిగా నియమించి, తాగునీరు, కూర్చునే సౌకర్యం తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
తహసీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు, వైద్యాధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గ్రామపంచాయతీ స్థాయిలో
చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు ఒకేచోట అధిక సంఖ్యలో గుమిగూడకుండా గ్రామపంచాయతీ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించే విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సులభంగా ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీటి నిల్వలపై పూర్తి సమాచారం సిద్ధం చేయాలి
ప్రస్తుత వర్షపాత పరిస్థితులు, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆయకట్టు సాగు, తాగునీటి అవసరాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ చెరువుల్లో ఉన్న నీటి నిల్వలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామాల్లోని చెరువుల నీటిని తాగునీరు, పశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులతో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీటి పొదుపు, వినియోగంపై ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలన్నారు.
రైతులకు అందుబాటులో ఉన్న నీటి వివరాలను తెలియజేసేందుకు గ్రామీణ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాల్లో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి
వనమహోత్సవం కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటల నిర్వహణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డీఆర్డీఏ అధికారి శ్రీరాం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మనోహర్, నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



