Last Updated:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మడావి కన్నీబాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికైంది. ఆమె జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గిరిజన గూడెం నుంచి బయలుదేరిన ఓ యువతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్వత యాత్రల్లో ఒకటైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది. కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కొలాం గిరిజన యువతి మడావి కన్నీబాయి తన అసాధారణ సాహసాలతో ఇప్పటికే ఎన్నో పతకాలు, ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని మరోసారి జిల్లాతో పాటు తెలంగాణ గర్వపడేలా చేసింది.
చిన్నప్పటి నుంచే సాహస క్రీడలపై ఆసక్తి పెంచుకున్న కన్నీబాయి, ఎత్తైన పర్వతాలు, ప్రమాదకరమైన జలపాతాలను సైతం ఏమాత్రం భయపడకుండా అధిరోహిస్తూ తన ప్రతిభను చాటుకుంది. 2020 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా కటిక జలపాతంలో జరిగిన ప్రపంచస్థాయి వాటర్ ర్యాపెల్లింగ్ పోటీల్లో 18 దేశాల క్రీడాకారులతో పోటీ పడుతూ విశేష ప్రతిభ కనబరిచింది. కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 400 మీటర్ల దూరం, 30 అడుగుల ఎత్తైన జలపాతం నుంచి ర్యాపెల్లింగ్ పూర్తి చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతకుముందు 2019లో 6,512 అడుగుల ఎత్తైన భగీరథ-2 పర్వతాన్ని అధిరోహించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న కన్నీబాయి, 2022లో ఉత్తరాఖండ్‌లోని 14,700 అడుగుల ఎత్తైన పంగర్చుల పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిచెప్పింది. ఒక్కో విజయంతో తన సాహసయాత్రను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
తాజాగా ఈ నెల 17 నుంచి ప్రారంభమై ఆగస్టు 15 వరకు కొనసాగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు కన్నీబాయి ఎంపిక కావడం మరో విశేషం. ఈ యాత్రలో భారత జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై ఆవిష్కరించనున్న బృందానికి ఆమె నాయకత్వం వహించనుండటం మరింత గర్వకారణంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రలో పాల్గొనే అవకాశం దక్కడం తన జీవితంలో మరపురాని మైలురాయిగా నిలుస్తుందని కన్నీబాయి ఆనందం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే గ్రామీణ యువత కూడా ప్రపంచ వేదికపై సత్తా చాటగలరని కన్నీబాయి విజయగాథ మరోసారి నిరూపిస్తోంది. మారుమూల గిరిజన గూడెం నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర వరకు చేరుకున్న ఆమె ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె విజయవంతంగా యాత్రను పూర్తి చేసి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా ప్రజలు, గిరిజనులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Adilabad,Telangana
