Last Updated:
విశాఖ బీచ్‌లోని నల్లటి ఇసుక కాలుష్యం కాదు, అది విలువైన ఖనిజ సంపద అని ప్రొఫెసర్ ఎం. జగన్నాథరావు తెలిపారు. ఇందులో ఇల్మనైట్, టైటానియం వంటి హెవీ మినరల్స్ ఉంటాయి.
విశాఖపట్నం బీచ్ రోడ్డులో తరచూ కనిపించే నల్లటి ఇసుకను చూసి చాలామంది అది కాలుష్యం ప్రభావమని భావిస్తుంటారు. అయితే ఆ అపోహలకు ప్రముఖ భూభౌతిక శాస్త్రవేత్త, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం. జగన్నాథరావు పూర్తి స్థాయిలో తెరదించారు. బీచ్‌లో కనిపించే నల్లటి ఇసుకకు కాలుష్యంతో ఎలాంటి సంబంధం లేదని, అది ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన ఖనిజ సంపద అని ఆయన స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ జగన్నాథరావు వివరించిన ప్రకారం, విశాఖ తీరంలో కనిపించే ఈ నల్లటి ఇసుకలో అధిక విలువ కలిగిన హెవీ మినరల్స్ అధికంగా ఉంటాయి. సాధారణంగా విశిష్ట గురుత్వాకర్షణ 2.5 కంటే ఎక్కువ ఉన్న ఖనిజాలను హెవీ మినరల్స్‌గా పరిగణిస్తారు. విశాఖ తీరంలోని ఇసుకలో సుమారు 12 శాతం వరకు ఈ ఖనిజాలు ఉండగా, వాటిలో ముఖ్యంగా ఇల్మనైట్, టైటానియం వంటి అత్యంత విలువైన ఖనిజాలతో పాటు కొన్ని రకాల రేడియోధార్మిక ఖనిజాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ నల్లటి ఇసుక విశాఖపట్నానికే ప్రత్యేకమైనది కాదని, భారతదేశ తూర్పు తీరప్రాంతమంతా విస్తరించి ఉంటుందని ఆయన తెలిపారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో ఈ తరహా ఇసుక కనిపిస్తుందని చెప్పారు. కొండల్లోని ఖనిజాలు నదుల ద్వారా సముద్రంలోకి చేరి, అక్కడ అలల ప్రభావంతో తిరిగి తీరానికి కొట్టుకురావడం వల్లే ఈ నల్లటి ఇసుక ఏర్పడుతుందని వివరించారు.
ఈ ఇసుకలోని ఖనిజాల ప్రత్యేకత ఏమిటంటే అవి అత్యంత అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. అందుకే వీటిని అంతరిక్ష నౌకలు, యుద్ధ విమానాలు, అధిక ఉష్ణోగ్రతలతో పనిచేసే పారిశ్రామిక యంత్రాలు, భారీ పరిశ్రమల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారని ప్రొఫెసర్ జగన్నాథరావు తెలిపారు. ముఖ్యంగా టైటానియం వంటి ఖనిజాలు రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాల్లో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయని చెప్పారు.
అందువల్ల విశాఖ బీచ్‌లో కనిపించే నల్లటి ఇసుకను చూసి అది కాలుష్యమని భయపడాల్సిన అవసరం లేదని, అది మన తీర ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఖనిజ సంపద అని ప్రొఫెసర్ జగన్నాథరావు స్పష్టం చేశారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని తెలుసుకుని అపోహలకు దూరంగా ఉండాలని, శాస్త్రీయ అవగాహనతో ప్రకృతి సంపదను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
Visakhapatnam,Andhra Pradesh
