దేశంలో సోలార్ విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్లకే కాకుండా సామాన్యుల ఇళ్లు, రైతుల పొలాలకు కూడా ఈ సదుపాయం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పథకాలతో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతోంది. దీంతో కరెంట్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయం సంపాదించే మార్గాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 13న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం మొత్తం రూ.75,021 కోట్లను కేటాయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గృహ రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. అంతేకాదు, ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా రుణాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాతీయ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంటి యజమానులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం నుంచి సబ్సిడీ డబ్బులు అందుకోవడం వరకు అన్ని పనులు ఈ పోర్టల్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

