Last Updated:
మొదట్లో ఇది కొంతసేపు పిల్లలను బిజీగా ఉంచే మార్గంలా కనిపించినా, క్రమంగా అదే అలవాటుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫోన్ లేకపోతే తినకపోవడం, నిద్రపోకపోవడం, ఏడవడం, కోపం తెచ్చుకోవడం వంటి ప్రవర్తనలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ పిల్లల జీవితంలో భాగమైపోయాయి. చిన్న వయసులోనే పిల్లలు ఫోన్లు, ట్యాబ్లెట్లను సులభంగా ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు లేదా పిల్లలు మారాం చేస్తున్నప్పుడు వారి చేతికి ఫోన్ ఇచ్చి కార్టూన్లు, వీడియోలు చూపించడం సాధారణమైపోయింది. మొదట్లో ఇది కొంతసేపు పిల్లలను బిజీగా ఉంచే మార్గంలా కనిపించినా, క్రమంగా అదే అలవాటుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫోన్ లేకపోతే తినకపోవడం, నిద్రపోకపోవడం, ఏడవడం, కోపం తెచ్చుకోవడం వంటి ప్రవర్తనలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2025-26లో కూడా పిల్లలు, యువతలో డిజిటల్ వినియోగం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమైంది. అయితే దేశవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురయ్యారనే విషయంపై కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవని సర్వే పేర్కొంది. మరోవైపు, లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పిల్లలు సోషల్ మీడియా, ఓటీటీ లేదా ఆన్లైన్ గేమింగ్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారని భావిస్తున్నట్లు వెల్లడైంది.
పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వల్ల వారి రోజువారీ జీవనశైలిపై ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు చదువుపై ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడే సమయం తగ్గితే సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన అవకాశాలు కూడా తగ్గవచ్చు. సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలు, వయసుకు తగని కంటెంట్, బెట్టింగ్ యాప్‌లు వంటి ప్రమాదాల నుంచి పిల్లలను కాపాడేందుకు కూడా పర్యవేక్షణ అవసరం.
పిల్లలకు బోర్ కొట్టడం కూడా తప్పు కాదు. ఖాళీ సమయంలో ఏం చేయాలో తెలియకపోవడం వల్లే వారు కొత్త ఆటలు ఆలోచిస్తారు, కథలు ఊహించుకుంటారు, బొమ్మలు గీస్తారు. ప్రతి క్షణం ఫోన్లో కొత్త వీడియోలు చూడటం అలవాటైతే స్వయంగా ఆలోచించి సమయాన్ని గడిపే అవకాశం తగ్గవచ్చు. అందుకే పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ ఇవ్వకుండా పుస్తకాలు చదవడం, బయట ఆడుకోవడం, మొక్కలకు నీళ్లు పోయడం, బొమ్మలు తయారు చేయడం వంటి పనులను ప్రోత్సహించాలి.
ఫోన్లను పూర్తిగా నిషేధించడం కంటే వాటి వినియోగానికి స్పష్టమైన నియమాలు పెట్టడం మంచిది. పిల్లల వయసుకు తగిన కంటెంట్ మాత్రమే చూపించాలి. రోజులో ఎంతసేపు ఫోన్ వాడాలనే దానిపై తల్లిదండ్రులు పరిమితులు విధించాలి. భోజనం చేసే సమయంలో, చదువుకునేటప్పుడు, నిద్రకు ముందు ఫోన్లకు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఫోన్ వినియోగాన్ని తగ్గించి ఆదర్శంగా నిలవాలి. పిల్లలతో కలిసి ఆటలు ఆడటం, మాట్లాడటం, బయటకు తీసుకెళ్లడం ద్వారా వారికి ఫోన్‌కు ప్రత్యామ్నాయమైన ఆనందాన్ని అందించవచ్చు.
స్మార్ట్‌ఫోన్ పిల్లలకు జ్ఞానాన్ని అందించే సాధనంగా ఉపయోగపడుతుంది. అయితే అది వారి ఆటలు, చదువు, నిద్ర, కుటుంబ సంబంధాలను దెబ్బతీయకూడదు. పిల్లల చేతిలో ఫోన్ ఉండటమే సమస్య కాదు.. దాని వినియోగంపై నియంత్రణ లేకపోవడమే అసలు సమస్య. తల్లిదండ్రుల ప్రేమతో కూడిన పర్యవేక్షణ, సరైన అలవాట్లు పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో అవసరం.

