Last Updated:
సినిమాల్లో హీరోలు ద్విపాత్రాభినయం చేయడం, త్రిపాత్రాభినయం చేయడం చూస్తుంటాం. మరికొందరు నటులు ఏకంగా పది పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కమల్ హాసన్ వంటి నటులు ‘దశావతారం’లో పది విభిన్న పాత్రలు పోషించి తమ నటనా ప్రతిభను చాటుకున్నారు.
సినిమాల్లో హీరోలు ద్విపాత్రాభినయం చేయడం, త్రిపాత్రాభినయం చేయడం చూస్తుంటాం. మరికొందరు నటులు ఏకంగా పది పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కమల్ హాసన్ వంటి నటులు ‘దశావతారం’లో పది విభిన్న పాత్రలు పోషించి తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఓ తమిళ హాస్య నటుడు ఒకే సినిమాలో ఏకంగా 16 పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతేకాదు, మహిళా గెటప్‌లోనూ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు.. యోగిబాబు.
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన హావభావాలతో ప్రేక్షకులను నవ్వించే ఆయన.. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన ‘జైలర్’, ‘జైలర్ 2’ వంటి సినిమాల్లో తన కామెడీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన నటనా వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రముఖ నటుడు ప్రభుదేవా హీరోగా నటించిన సినిమా ‘మూన్‌వాక్’లో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలో ఆయన ఒకటి, రెండు కాదు.. ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒకే నటుడు ఇన్ని పాత్రల్లో కనిపించడం ఆసక్తికరంగా మారగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
ఇక యోగిబాబు పోషించనున్న పాత్రల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఆయన మహిళా గెటప్‌లో కనిపించబోతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, ఆ మహిళ పాత్రకు భర్తగా కనిపించే వ్యక్తి కూడా యోగిబాబేననే ప్రచారం జరుగుతోంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ఈ ఆసక్తికి కారణమైంది. ఫ్యామిలీ ఫొటోను తలపిస్తున్న ఈ పోస్టర్‌లో మహిళా గెటప్‌లో ఉన్న యోగిబాబు సోఫాపై కూర్చొని కనిపిస్తున్నారు. ఆమె పక్కనే కూర్చొని భుజంపై చేయి వేసిన వ్యక్తి కూడా యోగిబాబే కావడం విశేషం.
దీంతో ఒకే సినిమాలో ఇన్ని విభిన్నమైన పాత్రల్లో యోగిబాబు ఎలా కనిపించబోతున్నారు? మహిళా గెటప్‌లో ఆయన చేసే కామెడీ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ఆ పోస్టర్ చూసిన నెటిజన్లు యోగిబాబు తనదైన శైలిలో మరోసారి నవ్వులు పూయించడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ ఏఆర్ రెహమాన్. ఆయన ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ గెస్ట్ రోల్‌లోనూ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుదేవా, యోగిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. మరి 16 పాత్రల్లో యోగిబాబు చేసే సందడి థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.

