పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (DoPPW) 2026 అక్టోబర్ 29న ఈ నిబంధనలపై వివరణ ఇచ్చింది. పెళ్లి కాని కుమార్తెలు, భర్త చనిపోయిన కుమార్తెలు, విడాకులు తీసుకున్న కుమార్తెలు, మళ్లీ పెళ్లి చేసుకున్న సంతానం లేని వితంతువులు, ఆర్థికంగా ఆధారపడిన తల్లిదండ్రులు, వైకల్యం ఉన్న పిల్లలు, సోదరులు, సోదరీమణులకు ఈ నిబంధనలు ఎలా వర్తిస్తాయో వివరించింది.
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్తో ఉన్న బంధాన్ని బట్టి ఆదాయ పరిమితి మారుతుంది. సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 50(11) ప్రకారం.. ఫ్యామిలీ పెన్షన్ మినహా ఇతర మార్గాల ద్వారా కుటుంబ సభ్యులకు వచ్చే నెలవారీ ఆదాయం రూ.9,000 కంటే తక్కువగా ఉండాలి. దీనికి వర్తించే డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) కూడా కలిపి ఈ పరిమితిని లెక్కిస్తారు. అయితే ఈ ఆదాయ పరిమితి వైకల్యం ఉన్న పిల్లలు, సోదరులు, సోదరీమణులకు వర్తించదు. మిగతా అర్హులైన కుటుంబ సభ్యులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం కనీస ఫ్యామిలీ పెన్షన్ ఎంత ఉందో, దానికి సమానంగా ఈ రూ.9,000 పరిమితిని నిర్ణయించారు. మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు, సోదరులు, సోదరీమణులకు మాత్రం ఆదాయ పరిమితి వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ కాకుండా ఇతర మార్గాల ద్వారా వారికి వచ్చే ఆదాయం.. వారు పొందేందుకు అర్హులైన పెన్షన్ మొత్తం కంటే తక్కువగా ఉండాలి. ప్రస్తుతం ఈ పెన్షన్ మొత్తం ఉద్యోగి జీతంలో 30 శాతంగా ఉంటుంది. దీనికి వర్తించే డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) కూడా అదనంగా కలుస్తుంది.
భార్య లేదా భర్తకు కూడా ఆదాయ పరిమితి ఉంటుందా?
చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య లేదా భర్తకు ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. అంటే వారికి ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఎంత డబ్బు వస్తున్నా ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. అయితే భర్త చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న, పిల్లలు లేని వితంతువులకు ఈ మినహాయింపు వర్తించదు. వారు ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే ఇతర అర్హులైన కుటుంబ సభ్యులకు వర్తించే ఆదాయ పరిమితిని పాటించాలి.
కుటుంబంలోని కొంతమంది సభ్యులు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఆర్థిక సాయం మీద ఆధారపడి జీవించారని నిరూపించాలి. వీరిలో పెళ్లి కాని కుమార్తెలు, భర్త చనిపోయిన కుమార్తెలు, విడాకులు తీసుకున్న కుమార్తెలు, ఆర్థికంగా ఆధారపడిన తల్లిదండ్రులు, వైకల్యం ఉన్న సోదరులు, సోదరీమణులు ఉంటారు. వీరికి ఫ్యామిలీ పెన్షన్ అందాలంటే ఆర్థికంగా మరణించిన వ్యక్తిపై ఆధారపడి ఉన్నట్లు నిరూపించాల్సి ఉంటుంది. ఈ విషయంపై పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ణయించేందుకు ఉపయోగించే ఆదాయ పరిమితులు.. వారు తమ జీవనానికి సరిపడా ఆదాయం సంపాదిస్తున్నారా లేదా అని అంచనా వేయడానికి నిర్ణయించిన పరిమితులతో సమానంగా ఉంటాయని తెలిపింది.
మొత్తంగా చూస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే కుటుంబ సభ్యుల బంధుత్వం, ఆదాయం, ఆర్థిక ఆధారపడటం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. భార్య లేదా భర్తకు ఆదాయ పరిమితి లేకపోయినా, ఇతర అర్హులైన కుటుంబ సభ్యులు ప్రభుత్వం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా కుమార్తెలు, తల్లిదండ్రులు, వైకల్యం ఉన్న కుటుంబ సభ్యులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఈ అర్హతలను తెలుసుకోవడం మంచిది.
