Last Updated:
Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ప్రముఖ ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయనున్న ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి సీఎం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందెశ్రీ మళ్లీ పాటై పుడతాడని హెచ్చరించారు. తాను అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల సర్కారును మరోసారి రానివ్వనని స్పష్టం చేశారు.
“కేసీఆర్ 1000 ఎకరాల్లో, కేటీఆర్ 100 ఎకరాల్లో, హరీష్‌రావు 50 ఎకరాల్లో, కవిత 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ సమాజం శ్రీమంతుల్ని చేసింది. కానీ, అలాంటి రాష్ట్రానికి వాళ్లు తిరిగి ఏమిచ్చారు? ఉన్నదంతా దోచుకున్నారు. మీరు నిజాం రాజును మించిన ధనవంతులుగా ఎలా మారారు?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు అప్పుడే క్షమించారని వారు అనుకుంటున్నారా అని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమకారులను, కవులను గత పాలకులు ఘోరంగా అవమానించారని సీఎం ఆరోపించారు. దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా నిలబడిన కవి అందెశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను కూడా ప్రగతిభవన్ గేటు ఎదుట ఎర్రటి ఎండలో నిలబెట్టి అవమానించారని, ఆ విధంగా కవులను, గాయకులను అవమానించినప్పుడే దొరలను సాగనంపాలని తెలంగాణ జనం నిర్ణయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని ప్రతిపక్ష నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. “బీఆర్ఎస్ పాలకులు తమ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల గురించి, ఉద్యోగ నియామకాల గురించి ఒక్క రోజైనా ఆలోచించారా? వారి పాలనలో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపు 70 వేల ఉద్యోగాలిచ్చాం. తల్లిదండ్రుల సాక్షిగా వారందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాము అధికారంలోకి వచ్చాకే గ్రూప్-1 పరీక్షను విజయవంతంగా నిర్వహించామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Hyderabad,Telangana

