ఈ మార్పు అమలులోకి వస్తే, గత పదేళ్లుగా కొనసాగుతున్న వేతన పరిమితిలో మొదటిసారి మార్పు చోటు చేసుకున్నట్టవుతుంది. చివరిసారిగా 2014 సెప్టెంబర్లో EPF వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు. ఇప్పుడు దానిని మరోసారి సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రారంభంలో EPF వేతన పరిమితిని నెలకు రూ.30,000కు పెంచే ప్రతిపాదనను కూడా అధికారులు పరిశీలించారు. అయితే వివిధ ఆర్థిక అంశాలు, ప్రభుత్వంపై పడే భారం, యజమానులపై ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరకు రూ.25,000 పరిమితికే వ్యయ శాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు వెళ్లనుంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

