న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంద్ర భూషణ్ కుమార్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి, EPFO బోర్డు సభ్యులు, ఉద్యోగులు, యజమానుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా కార్మికులకు సామాజిక భద్రత అందిస్తున్న EPFO ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. EPFO గత 74 ఏళ్లలో దేశంలోని కార్మికులకు నమ్మకమైన సామాజిక భద్రతా సంస్థగా ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం 8 కోట్లకు పైగా సభ్యులు ఈ సంస్థ పరిధిలో ఉన్నారని, వారి నుంచి సమకూరిన నిధి సుమారు రూ.32 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఉద్యోగుల కష్టార్జిత పొదుపులను భద్రంగా నిర్వహించడం EPFOపై ఉన్న బాధ్యత అని చెప్పారు. కేవలం పీఎఫ్ డబ్బులు నిర్వహించడమే కాకుండా, కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదును సానుభూతితో పరిశీలించి, ఉద్యోగులు, పెన్షనర్లకు గౌరవప్రదమైన సేవలు అందించాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవలను వేగవంతం చేయడంతో పాటు, చివరి స్థాయిలో ఉన్న కార్మికులకు కూడా ప్రయోజనాలు చేరాలని స్పష్టం చేశారు. ‘సేవే మన సంస్కారం’ అనే సందేశంతో పనిచేయాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో EPFO కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
EPFO తీసుకొచ్చిన ముఖ్యమైన సదుపాయాల్లో వాట్సాప్ సేవలు ఒకటి. ఇకపై సభ్యులు EPFO ధృవీకరించిన వాట్సాప్ సేవ ద్వారా తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవచ్చు. క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించిన మార్గదర్శకత్వం, సహాయం కూడా పొందవచ్చు. PMVBRY పథకానికి సంబంధించిన అవసరాల కోసం కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా మొబైల్లో అందుబాటులో ఉండే వాట్సాప్ ద్వారానే ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండటంతో EPFO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఈ సేవలను ఉపయోగించడానికి EPFO అధికారికంగా ధృవీకరించిన వాట్సాప్ నంబర్‌నే సంప్రదించాలి.
మరో కీలక నిర్ణయం అర్హత కలిగిన నిష్క్రియాత్మక EPF ఖాతాలకు సంబంధించినది. ఖాతాలో రూ.1,000 వరకు నిల్వ ఉండి, ఆధార్ ధృవీకరణ పూర్తయిన ఖాతాదారులు ఇకపై వ్యక్తిగతంగా క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ సెటిల్మెంట్ ప్రక్రియ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అవసరమైన గుర్తింపు, బ్యాంక్ ఖాతా వివరాల ధృవీకరణ పూర్తయిన తర్వాత EPFO ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు లక్ష ఖాతాలకు చెందిన దాదాపు రూ.5 కోట్ల మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
EPFO తన సేవలను వేగవంతం చేసేందుకు CITES 2.01 ద్వారా సాంకేతిక మార్పులు చేపట్టింది. వీటి ప్రభావంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని సంస్థ తెలిపింది. అక్టోబర్ 2026 నాటికి క్లెయిమ్ పరిష్కారానికి పట్టే సగటు సమయం 2.57 రోజులకు తగ్గింది. సభ్యులు తమ పీఎఫ్ పొదుపులను వేగంగా పొందేందుకు ఈ మార్పులు ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో సేవలను మరింత సులభతరం చేయాలని EPFO లక్ష్యంగా పెట్టుకుంది.
74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా EPFO ఏడు ప్రచురణలను విడుదల చేసింది. వీటిలో EPFO స్టేట్ ప్రొఫైల్ 2026, తీర్పుల సంకలనం, కేంద్ర నిధి హిందీ పత్రిక, ‘డెస్క్‌కు ఆవల, సాధారణానికి ఆవల’, ‘పరిపాలనను పునఃకల్పన చేయడం’, ‘శాసన విధి మే కరుణ’, ఇండియన్ జర్నల్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఉన్నాయి. వీటిలో సంస్థ పనితీరు, న్యాయపరమైన అంశాలు, ఉద్యోగుల ప్రతిభ, పరిపాలనా సంస్కరణలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అలాగే అత్యుత్తమ సేవలు అందించిన ప్రాంతీయ, జోనల్ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులకు భవిష్య నిధి అవార్డులు 2026 ప్రదానం చేశారు. క్లెయిమ్‌ల పరిష్కారం, పెన్షన్ సేవలు, ఫిర్యాదుల నిర్వహణ, సాంకేతిక ఆవిష్కరణలు, శిక్షణ, ప్రచారం వంటి అంశాల్లో చూపిన పనితీరును గుర్తించి ఈ అవార్డులు అందించారు.
