ఏజెన్సీ గిరిజన ప్రాంతాల అభివృద్దే జిల్లా పోలీసుల లక్ష్యం.

సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మించడం అభినందనీయం…
జిల్లా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్న చర్ల పోలీసులు…
గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి…
విద్య ద్వారానే చిన్నారులకు బంగారు భవిష్యత్తు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
ప్రభ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల :
మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు ఈ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు.మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ అటవీ గిరిజన ప్రాంతమైన బక్క చింతలపాడు గ్రామంలో చదువుతున్న చిన్నారులకు సరైన భవనం లేక పూరి గుడిసెలోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చిన్నారులు అనేక అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న చర్ల సీఐ ఏ రాజువర్మ, తన సిబ్బంది ఎస్సైలు ఆర్ నర్సిరెడ్డి, పి కేశవ్ లతో నూతన పాఠశాల నిర్మాణం కోసం కావలసిన ఆర్థిక వనరులు పై చర్చించగా, ఎస్సై ఆర్ నర్సిరెడ్డి తన ఇంజనీరింగ్ మిత్రులు విదేశాలలో వివిధ వృత్తులలో ఉన్నవారికి తెలియజేసి,కొంతమేర వారి ఆర్థిక వితరణతో పాఠశాల నిర్మాణంలో భాగస్వామ్యం చేసి, మిగతా నిధులు చర్ల సీఐ రాజువర్మ, ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీస్ శాఖ సిబ్బంది కలిసి సుమారు 2 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో రెండు గదులు కలిగిన పాఠశాల రేకుల భవనాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి మండల పరిషత్ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐ రాజువర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ చర్ల సీఐ రాజువర్మ ఆధ్వర్యంలోని చర్ల పోలీసులు మారుమూల అటవీ ప్రాంత గ్రామాలలో గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో చర్ల సీఐ నేతృత్వంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎస్ ఐ ఆర్ నర్సిరెడ్డి మిత్రబృందం పీవీ నరసింహారెడ్డి, పి రామారావు, పి కార్తీక్, టి హర్ష, టీ శశిధర్ రెడ్డి, పి రమణారెడ్డి ( యూఎస్ఏ )తో కలిసి రెండు లక్షల 50 వేల రూపాయల వ్యయంతో పాఠశాల భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలలో సరైన వసతులు లేకుండా చదువుకుంటున్న చిన్నారులు పడుతున్న ఆవేదనను తెలుసుకుంటున్న సీఐ రాజు వర్మ సొంత ఖర్చులతో లక్షలాది రూపాయలు హెచ్చించి గత సంవత్సరం బూరుగుపాడు గ్రామంలో మండల పరిషత్ పాఠశాల రేకుల భవనాన్ని ఏర్పాటు చేశారని, అలాగే బక్కచింతలపాడు గ్రామంలో మరో భవనాన్ని నిర్మించడం పట్ల చర్ల పోలీసులను అభినందించారు.నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న చర్ల పోలీసులు జిల్లా పోలీసు శాఖకి తలమానికంగా మారారని కొనియాడారు. అలాగే మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఏజెన్సీ అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంత ఆదివాసి చిన్నారులు చదువుని అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని తెలిపారు. చర్ల సీఐ రాజువర్మ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ సహాయ సహకారాలతో మండల పరిధిలోని ఆదివాసి అటవీ గిరిజన ప్రాంత గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, తదితర కార్యక్రమాలలో పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థినీ,విద్యార్థులకు స్కూలు బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఆర్ నర్సిరెడ్డి, పి కేశవ్, ఎస్ బి 2 ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

