పాత పెన్షన్ సాధన ఉద్యమానికి ఉద్యోగులంతా ఏకమవ్వాలి.
ఆగస్టు 23న "హైదరాబాద్ చలో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపు
ప్రభన్యూస్ కామారెడ్డి జిల్లా.
రాష్ట్రస్థాయిలో పాత పెన్షన్ విధానం సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సహకరించి విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపునిచ్చారు.బుధవారం కామారెడ్డి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేపట్టి వివిధ జిల్లాల్లో ఉద్యోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంఘ బలోపేతం, సభ్యత్వ నమోదు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.పర్యటన సందర్భంగా జిల్లా, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి సమగ్రంగా తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.పాత పెన్షన్ సాధనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 23న నిర్వహించనున్న "హైదరాబాద్ చలో" కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఎల్లారెడ్డి మనోహర్, బాబు రెడ్డి, శ్రీనివాస్, శంకర్, శేఖర్, చుక్క బాబా గౌడ్, శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

