భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. రైళ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్లాట్‌ఫామ్‌లు ప్రయాణికులకు ఎప్పుడూ కనిపించే దృశ్యాలే. అయితే భారతీయ రైల్వేకు ఒక ప్రత్యేకమైన మస్కట్ కూడా ఉందని చాలామందికి తెలియదు. అదే భోలు అనే ఏనుగు. భారతీయ రైల్వేకు చెందిన ఈ భోలు ఏనుగు కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు. రైల్వే గార్డు దుస్తులు వేసుకుని, చేతిలో గ్రీన్ సిగ్నల్ ల్యాంప్ పట్టుకున్న ఈ నవ్వుతూ కనిపించే ఏనుగు.. రైల్వే సేవలకు గుర్తుగా మారిపోయింది. ప్రయాణికులకు స్నేహపూర్వకంగా, నమ్మకంగా సేవలు అందించే భారతీయ రైల్వే ప్రతిరూపంగా నిలిచింది. రైల్వే మస్కట్‌గా ఏనుగునే ఎందుకు ఎంచుకున్నారనేదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఏనుగులు అంటే మనకు గుర్తొచ్చేవి బలం, తెలివితేటలు, సహనం, నమ్మకమైన స్వభావం. భారతీయ రైల్వే ప్రయాణికులకు అందించాలనుకునే సందేశం కూడా ఇదే. అందుకే ఏనుగును మస్కట్‌గా ఎంచుకున్నారు. చేతిలో గ్రీన్ సిగ్నల్ ల్యాంప్ పట్టుకుని నవ్వుతూ కనిపించే భోలు.. రైళ్లు సజావుగా నడిచేలా చూసే రైల్వే సిబ్బంది బాధ్యతను సూచిస్తుంది. దాని స్నేహపూర్వక రూపం పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటుంది. ఇలా భోలు ద్వారా భారతీయ రైల్వేకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ప్రయాణికులు కూడా ఈ ఏనుగును సులభంగా గుర్తుపట్టగలుగుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

