Last Updated:
పీఎఫ్ ఖాతాదారులకు EPFO కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలకమైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్‌లో జమ అయిన మొత్తం డబ్బును ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, విడతల వారీగా పొందే అవకాశం కల్పించేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)కు ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా విశ్రాంత ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని తీసుకుంటూ, మిగిలిన సొమ్ముపై వడ్డీ పొందవచ్చు. దీనివల్ల పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను కొంతవరకు సులభంగా నిర్వహించుకునే వీలుంటుంది.
ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి (CBT) 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖతో పాటు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో పీఎఫ్ ఖాతాదారులకు విడతల వారీగా డబ్బులు తీసుకునే సౌకర్యానికి ఆమోదం తెలిపారు. ఈ విధానం పూర్తిగా స్వచ్ఛందమైనది. సభ్యులు తప్పనిసరిగా ఇందులో చేరాల్సిన అవసరం లేదు.
కొత్త SWP సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత అర్హులైన సభ్యులు తమ అవసరాన్ని బట్టి ప్రతి నెలా, మూడు నెలలకోసారి లేదా ఏడాదికి ఒకసారి పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఖాతాలో మిగిలిన డబ్బుపై యథావిధిగా వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. దీంతో మొత్తం సొమ్మును ఖాళీ చేయకుండా, కొంత మొత్తాన్ని పెట్టుబడిగా కొనసాగించవచ్చు.
ఈ సౌకర్యాన్ని ఎప్పుడైనా నిలిపివేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా, పీఎఫ్ ఖాతాలో ఉన్న అసలు మొత్తాన్ని అలాగే ఉంచి, దానిపై వచ్చిన వడ్డీని మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం కూడా సభ్యులకు కల్పించనున్నారు.
ప్రారంభ దశలో 55 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా రూ.5 లక్షలకు మించి పీఎఫ్ నిల్వలు కలిగి ఉన్న 55 ఏళ్లు దాటిన సుమారు 6.32 లక్షల మంది సభ్యులు తొలి దశలో ప్రధానంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
పదవీ విరమణ అనంతరం క్రమబద్ధమైన ఆదాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పెన్షన్‌తో పాటు పీఎఫ్ నుంచి నిర్దిష్ట వ్యవధుల్లో డబ్బులు పొందడం వల్ల ఆర్థిక వెసులుబాటు పెరుగుతుంది. అర్హులైన కుటుంబ సభ్యులు, లబ్ధిదారులకు కూడా ఈ అవకాశాన్ని విస్తరించే ఆలోచన ఉంది. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రతను బలోపేతం చేయడం, పెట్టుబడులను తిరిగి మళ్లించడంలో ఎదురయ్యే నష్టభయాలను తగ్గించడం కూడా ఈ విధానం లక్ష్యాల్లో ఉన్నాయి.

