Last Updated:
ప్రతిష్ఠాత్మక ‘సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026’ వేడుకల్లో ప్రముఖ నటుడు ధనుష్ ‘ఎంటర్‌టైన్‌మెంట్ పాపులర్ ఛాయిస్’ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా తను చెఫ్ అవ్వాలనుకుని అనుకోకుండా నటుడినయ్యానని ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన 16వ ఎడిషన్ ‘సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026’ వేడుకల్లో ఆయన ‘ఎంటర్‌టైన్‌మెంట్ పాపులర్ ఛాయిస్’ అవార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేస్తున్న నిరంతర సేవలకు గాను ప్రజల ఓటింగ్ ద్వారా ధనుష్‌కు ఈ గౌరవం దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం ‘ఓం నమః శివాయ’ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ధనుష్, తను అసలు చెఫ్ అవ్వాలనుకున్నానని, కానీ దేవుడి దయ, తల్లిదండ్రుల ప్రార్థనలు, అభిమానుల ఆదరణతో అనుకోకుండా నటుడిగా మారానని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
వచ్చే ఏడాదితో తను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తవుతుందని, ఇలాంటి సమయంలో ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ధనుష్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ వేడుకకు ధనుష్ కుమారులు యాత్ర, లింగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తన పిల్లలు కేవలం తన కోసమే ఇక్కడికి వచ్చారని ధనుష్ తెలిపారు. భవిష్యత్తులో వారు తనను గర్వపడేలా చేయాలంటే, ముందుగా తను వారిని గర్వపడేలా చేయాలనే ఈ కష్టమంతా పడుతున్నానని ఆయన చెప్పారు. తమ తండ్రి నటించిన సినిమాలన్నీ తమకు ఎంతో ఇష్టమని, శుక్రవారం విడుదల కానున్న కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని యాత్ర, లింగ పేర్కొన్నారు.
All white, all swag! @dhanushkraja makes a grand entrance at CNN-News18’s Indian of the Year 2026, turning heads in a classic white shirt and traditional veshti. Effortless style, commanding presence and unmistakable superstar energy!#Dhanush https://t.co/wVgJ092tJS
— N.Parthiban (@NSParthiban6) November 19, 2026
శుక్రవారం తన కొత్త సినిమా విడుదల ఉన్నప్పటికీ, ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను మిస్ అవ్వకూడదనే ఢిల్లీకి వచ్చానని ధనుష్ వెల్లడించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ.ఎం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation Mole) నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.

