Last Updated:
రాత్రి 8 గంటల సమయంలో పాప అక్కడ కనిపించకపోవడంతో, తల్లి వద్దకు వెళ్లి ఉంటుందని భావించి సతీష్ నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచిన సతీష్.. పాప గురించి భార్యను, అత్తను ఆరా తీశారు.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో గుండెలను పిండేసే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాత్రి వేళ తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఏడు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, బ్లేడ్‌తో ఒంటిపై తీవ్రంగా గాయపరిచి పొదల్లో పడేసారు. ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీష్, సంధ్య దంపతులకు ఏడు నెలల కుమార్తె వైష్ణవి ఉంది. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో సతీష్ తన కుమార్తెతో కలిసి ఇంటి బయట నిద్రించారు. రాత్రి 8 గంటల సమయంలో పాప అక్కడ కనిపించకపోవడంతో, తల్లి వద్దకు వెళ్లి ఉంటుందని భావించి సతీష్ నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచిన సతీష్.. పాప గురించి భార్యను, అత్తను ఆరా తీశారు. పాప తమ వద్ద లేదని వారు చెప్పడంతో ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పాప కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కలిసి కాలనీ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక గోసంగి సంఘం భవనం సమీపంలోని పొదల్లో చిన్నారి వైష్ణవి స్పృహ కోల్పోయి పడి ఉండటం గమనించారు. చిన్నారి ఒంటిపై బ్లేడ్‌తో దారుణంగా కోసిన గాయాలు ఉండటాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా ఉన్న చిన్నారిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్ (ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి) కి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad,Telangana

