మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్.

కంభం ప్రభ న్యూస్ జూలై 21: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో లీప్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పి.టి.యమ్ 3.1) ను ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఘనంగా నిర్వహించాలని మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) అబ్దుల్ సత్తార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక అర్బన్ కాలనీలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి ప్రాథమిక తరగతుల విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పరీక్షించి అభ్యసన సామర్థ్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు అభ్యసనంపై చూపుతున్న ఆసక్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరింత మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎంఈవో, జూలై 24న జరిగే మెగా పేరెంట్స్ సమావేశానికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

