ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్
ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా ఆగస్టు 1 ::
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో కామారెడ్డి బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా నంది వేణు మాట్లాడుతూ, తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ సంబోధించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని, మరోవైపు ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపైనే విమర్శలు చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
విద్యార్థి వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి, బీజేపీ నాయకులు రజినీకాంత్, భూమేష్ యాదవ్, సందీప్, చిరంజీవి, అశోక్, బీజేవైఎం నాయకులు అరుణ్, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

