అర్జీలను బుట్టదాఖలు చేస్తే చర్యలు తప్పవు: అధికారులకు ఎమ్మెల్యే కళా హెచ్చరికప్రజా దర్బార్‌లో సమస్యల స్వీకరణ.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
ప్రభ న్యూస్ విజయనగరం చీపురుపల్లి జూలై 23:
చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై ప్రజలు ప్రధానంగా వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుధ్య లోపం, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల నిర్మాణం, రెవెన్యూ సమస్యలు, భూ ఆక్రమణలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, పక్కా ఇళ్ల మంజూరు, విద్యుత్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు.
అర్జీలను చీపురుపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ పుచ్చల విజయ్ కుమార్ స్వీకరించగా, అనంతరం ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారంపై నమ్మకంతో తమ వద్దకు వస్తారని, వారి అర్జీలను అధికారులు బుట్టదాఖలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించగలిగే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయుడు, నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

