Last Updated:
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) విడుదలకు సర్వం సిద్ధమైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబర్ 16న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే చిత్ర హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుణ్య దినాల్లో సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సేవలో పాల్గొన్న ‘విరోష్’ జంటను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఈ జంట సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Tirumala, Andhra Pradesh: Actors Vijay Deverakonda and Rashmika Mandanna participate in the Suprabhata Seva at the Tirumala Srivari Temple and offer prayers to Lord Venkateswara. Fans gather outside to take pictures with the couple. https://t.co/3S4ab0uj7s
— IANS (@ians_india) October 13, 2026
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రాయలసీమ ప్రాంతంలో గతంలో సంభవించిన తీవ్ర కరవు పరిస్థితులపై లోతైన పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేశారు.
1876-1878 కాలంలో దక్షిణ భారతదేశాన్ని అతలాకుతలం చేసిన ‘ది గ్రేట్ ఫేమిన్’ (మద్రాస్ కరవు) నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాలు, మైసూరు సంస్థానం వరకు విస్తరించిన ఈ పెను కరవులో దాదాపు కోటి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి బ్రిటీష్ పాలకుల నిర్లక్ష్యం, ప్రజల ఆకలి కేకలు, ఆ సంక్షోభం నడుమ జరిగిన ఓ వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టేలా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని మలిచారు. బలమైన చారిత్రక కథాంశం, అద్భుతమైన విజువల్స్, విజయ్-రష్మికల క్రేజీ కెమిస్ట్రీ వెరసి ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఈ హాలిడేస్ సినిమా కలెక్షన్స్ పై చాలా ప్రభావం చుపిస్తాయని కూడా అంచనా వేస్తున్నారు.

