Last Updated:
SpaceX: అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మరో సంచలనం సృష్టించాలని భావించిన దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు నిరాశే ఎదురైంది.
అతడి సంస్థ స్పేస్‌ఎక్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రోదసిలోకి ప్రయోగించిన తర్వాత తన అత్యంత భారీ స్టార్‌షిప్ రాకెట్‌లోని రెండు భాగాలను పూర్తిగా తిరిగి భూమిపైకి సురక్షితంగా సేకరించాలన్న స్పేస్‌ఎక్స్ ప్రతిష్ఠాత్మక డబుల్ క్యాచ్ ప్రయత్నం పాక్షికంగా విఫలమైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో మొదటి దశ బూస్టర్‌ను లాంచ్ టవర్ వద్ద ఒడిసిపట్టలేకపోయినప్పటికీ, స్టార్‌షిప్ వ్యోమనౌక మాత్రం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించి ప్రయోగాన్ని కొనసాగించింది.
చందమామ, అంగారక గ్రహాలపైకి మానవ సహిత యాత్రలు చేపట్టే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ ఈ స్టార్‌షిప్ మెగా రాకెట్‌ను రూపొందించింది. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది సూపర్ హెవీ బూస్టర్ కాగా, రెండోది స్టార్‌షిప్ వ్యోమనౌక. టెక్సాస్‌లోని స్టార్‌బేస్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:17 గంటలకు స్టార్‌షిప్ తన 15వ పరీక్షా ప్రయోగంలో భాగంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే వ్యోమనౌక నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది.
వాస్తవానికి ప్రణాళిక ప్రకారం ఆ బూస్టర్ తిరిగి టెక్సాస్‌లోని లాంచ్ టవర్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన ‘చాప్‌స్టిక్స్’ అనే భారీ యాంత్రిక హస్తాలు గాల్లోనే దాన్ని అత్యంత జాగ్రత్తగా ఒడిసిపట్టి, తదుపరి ప్రయోగాలకు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే, తిరుగు ప్రయాణంలో బూస్టర్ దిశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదాన్ని నివారించేందుకు స్పేస్‌ఎక్స్ బృందం దాన్ని తిరిగి టవర్ వద్దకు రప్పించే ఆలోచనను తక్షణమే విరమించుకుంది. వెంటనే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని నిర్దేశిత సముద్ర జలాల వైపు మళ్లించింది. లిఫ్టాఫ్ అయిన సరిగ్గా ఆరున్నర నిమిషాల తర్వాత సముద్ర జలాలకు ఎగువన ఆ బూస్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది.
బూస్టర్ పేలిపోయినప్పటికీ, ప్రధాన స్టార్‌షిప్ వ్యోమనౌక తన ప్రయాణాన్ని ఏమాత్రం ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగించింది. ఈ క్రమంలో తనతో పాటు తీసుకెళ్లిన 26 అధునాతన స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. భూమికి 275 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో 15 భ్రమణాలను పూర్తి చేసిన అనంతరం, ఈ వ్యోమనౌక తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకుని గాల్లోనే యాంత్రిక హస్తాల ద్వారా ‘క్యాచ్’ అయ్యేలా స్పేస్‌ఎక్స్ రూపొందించింది. స్టార్‌షిప్ ఎగువ భాగాన్ని ఈ విధంగా టవర్‌తో ఒడిసిపట్టేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. అయితే ప్రయోగం ఆరంభంలోనే సూపర్ హెవీ బూస్టర్‌ను కోల్పోవడం వల్ల, రాకెట్‌లోని రెండు దశలనూ ఒకే ప్రయోగంలో తిరిగి సేకరించాలన్న చారిత్రాత్మక ‘డబుల్ క్యాచ్’ కల నెరవేరకుండానే ముగిసింది.

