Last Updated:
అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత ఉధృతం చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ, అంతర్గత రాజకీయ నష్టాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత ఉధృతం చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, టెహ్రాన్ గానీ, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు గానీ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే కొత్త దాడులకు దిగబోనని ట్రంప్ ఇటీవల తన సలహాదారులకు చెప్పినట్లు సమాచారం.
గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ట్రంప్ ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు దాడులు పెంచుతామని హెచ్చరిస్తూనే, మరోవైపు ఉద్రిక్తతలు తగ్గించే సంకేతాలను ఆయన ఇస్తున్నారు.
ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు చేపట్టాలని పదవీ విరమణ చేయనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ డైరెక్టర్ రోమన్ గోఫ్‌మన్ శుక్రవారం వాషింగ్టన్లో అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ సహా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించాలని అరబ్ మిత్రదేశాలు కోరుతుండటంతో ట్రంప్ ఆలోచనలో పడ్డారు. తాను తలుచుకుంటే యుద్ధాన్ని వెంటనే ముగించగలనని, కానీ మిత్రదేశాల రక్షణ కోసం కాస్త సమయం తీసుకుంటున్నట్లు ట్రంప్ గురువారం వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకం ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ధరల పెరుగుదలతో అమెరికా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌పై పట్టు కోల్పోయి డెమోక్రాట్ల చేతిలో ఓడిపోవడానికి ఈ యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం అంగీకరించారు. సర్వేలో 55 శాతం మంది అమెరికన్లు ఈ యుద్ధం అనవసరమని అభిప్రాయపడ్డారు.

