Last Updated:
Revanth Reddy: ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ‘చలో ఢిల్లీ’ నిరసన ర్యాలీతో రాంలీలా మైదానం కిక్కిరిసిపోయింది.
రైళ్లను రద్దు చేసినప్పటికీ ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని, రానున్న రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర పాలకులు ప్రధానంగా పేద ప్రజల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి ఇండియా కూటమి అగ్రనేతలు కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి రాంలీలా మైదానం వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు.
నేతలంతా “ఓటు బచావో, దేశ్ బచావో” బ్యానర్లతో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితాల సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓట్ల గల్లంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే అర్హులైన పౌరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష కూటమి నేతలు గట్టిగా డిమాండ్ చేశారు.

