Last Updated:
Chalo Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి నేడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా భారీ పోరుబాటకు సిద్ధమైంది.
ఓటర్ల జాబితాల సవరణ కసరత్తు ప్రక్రియను నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం చలో ఢిల్లీ పేరుతో భారీ మెగా ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాజధానిలోని చరిత్రాత్మక రాంలీలా మైదానంలో ఈ సభ కోసం నిర్వాహకులు భారీ వేదికను సిద్ధం చేసి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్ – కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి విపక్ష నేతల నిరసన ప్రదర్శన ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రదర్శనగా కదులుతూ రాంలీలా మైదానానికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు సభా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కానున్న ఇండియా కూటమి అగ్రనేతలు, అక్కడి నుంచి వాహనాల్లో కలిసికట్టుగా ర్యాలీ ప్రారంభ ప్రాంతానికి చేరుకోనున్నారు.
విపక్షాల మెగా ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై నగరంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించి, పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే మింటో రోడ్ కూడలి నుంచి చేపట్టే పాదయాత్ర ప్రదర్శనకు తమ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేదని, దీనికి సంబంధించి దరఖాస్తు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇండియా కూటమి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నప్పటికీ ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొనడం లేదని సీపీపీ పేర్కొంది.
మరోవైపు, ఈ నిరసనకు పోటీగా 1984 సిక్కుల ఊచకోత ఘటనలను స్మరిస్తూ బాధితులకు సంఘీభావంగా ప్రదర్శనకు దిగుతున్నట్లు భాజపా శ్రేణులు, సిక్కు సంఘాలు ప్రకటించడంతో నగరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వ్యాపారులకు ఇండియా కూటమి తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ భాజపా చేస్తోన్న ప్రచారం పూర్తిగా అసత్యమని, అది వారి దుష్ప్రచారంలో భాగమేనని తీవ్రస్థాయిలో కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ ‘చలో దిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

