Last Updated:
కాకినాడలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై మాజీ డీఐజీ పీవీ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలింపు చర్యలు విస్తృతం చేయాలని, టోల్‌గేట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని సూచించారు.
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ, ఈ కేసుపై ఏపీ మాజీ డీఐజీ, AIM వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శుక్రవారం సాయంత్రం చిన్నారి నివాసానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, జ్ఞానేశ్వరి అదృశ్యమైన పరిస్థితుల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గాలింపు చర్యలను మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
జ్ఞానేశ్వరి కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న స్వల్ప వ్యవధి బ్యాటరీ కలిగిన ఫ్లై కెమెరాలతో ఆశించిన ఫలితాలు రావడం కష్టమని పీవీ సునీల్ అన్నారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే గాలిలో ఉండే డ్రోన్లకు బదులుగా, ఎక్కువసేపు నిరంతరాయంగా గాలిలో ఉండగల సామర్థ్యం ఉన్న ఫ్లై కెమెరాలను వినియోగిస్తే గాలింపు మరింత సమర్థవంతంగా సాగుతుందని సూచించారు. గతంలో కృష్ణా పుష్కరాల వంటి భారీ కార్యక్రమాల్లో ఎక్కువసేపు పనిచేసే వైమానిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగించిన అనుభవం తనకు ఉందని ఆయన గుర్తుచేశారు.
చిన్నారి అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న పీవీ సునీల్, ఒకవేళ చిన్నారిని సంచార జాతులకు చెందిన వ్యక్తులు లేదా బయటి ప్రాంతాలకు చెందిన వారు తీసుకెళ్లి ఉంటే, టోల్‌గేట్ల వద్ద లభించే సీసీటీవీ దృశ్యాలు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, కాకినాడ జిల్లాల పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలను పరిశీలిస్తే దర్యాప్తుకు ఉపయోగపడే సమాచారం లభించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా టోల్‌గేట్ల ద్వారా అందుబాటులో ఉండే సమాచారాన్ని దర్యాప్తులో ఎంతవరకు వినియోగిస్తున్నారన్న అంశంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దర్యాప్తు అన్ని దిశల్లో కొనసాగాలని, ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే ఇవి దర్యాప్తును మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేసిన సూచనలేనని ఆయన పేర్కొన్నారు.
జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని పీవీ సునీల్ అన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయనతో పాటు AIM జిల్లా, నియోజకవర్గ నాయకులు, మహిళా ప్రతినిధులు కూడా చిన్నారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరగా లభించాలని ప్రజలంతా ప్రార్థిస్తున్న వేళ, ఈ కేసులో ప్రతి సూచన, ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తూ గాలింపు చర్యలు మరింత వేగవంతం కావాలని స్థానికులు కోరుతున్నారు.
East Godavari,Andhra Pradesh
Jul 17, 2026 10:31 PM IST
