Last Updated:
KTR: రాష్ట్రంలో యువ గళాలు గర్జిస్తే ప్రభుత్వ కుర్చీలు కూలిపోతాయని, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు రాబోయే రోజుల్లో ‘డెత్ డిక్లరేషన్’ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని కేటీఆర్ విమర్శించారు. జిత్తులమారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి యువత మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవని, కేవలం ‘లూటీఫికేషన్లే’ జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదు కానీ, రాహుల్ గాంధీ జేబులు మాత్రం నిండుతున్నాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించనంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. “రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చింది రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికా? లేక రాహుల్ గాంధీకి జాబ్ ఇప్పించడానికా?” అని నిలదీశారు.
క్యాలెండర్లు మారుతున్నా రాష్ట్రంలో ‘జాబ్ క్యాలెండర్’ మాత్రం మారడం లేదని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఒక చిత్తు కాగితంలా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై ‘జంగ్ సైరన్’ మోగించడానికి యువతరం కదిలివచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలిస్తున్న తీరును తప్పుబడుతూ, ఆయన క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉండబోతోందని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.
Hyderabad,Telangana

