కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం రైతులకు మరింత ఉపయోగకరంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్–సవరించిన వడ్డీ రాయితీ పథకం (KCC-MISS) కింద ప్రభుత్వం పెట్టే ప్రతి రూ.1 పెట్టుబడి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రూ.2.30 నికర విలువ సృష్టించేందుకు దోహదపడుతోందని తాజా థర్డ్ పార్టీ అంచనా నివేదిక వెల్లడించింది. ఈ పథకం రైతులపై వడ్డీ భారం తగ్గించడమే కాకుండా, వ్యవసాయ ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణ, పశుపోషణ, మత్స్యరంగ అభివృద్ధికి కూడా గణనీయంగా తోడ్పడుతోందని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పనితీరుపై నిర్వహించిన సమగ్ర అంచనా నివేదికతో పాటు, దేశవ్యాప్తంగా KCC అమలు, రుణాల పంపిణీ, వడ్డీ రాయితీలు, సాంకేతిక సంస్కరణలు, రాష్ట్రాల వారీ గణాంకాలను ఆయన సభలో వివరించారు.

