Last Updated:
కరుంగలి మాలలు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రాచుర్యం పొందుతున్నాయి. నకిలీలను గుర్తించడానికి నీటి పరీక్ష, రంగు పరీక్షలు చేయాలి. ధరించేటప్పుడు నియమాలు పాటించాలి.
భారతీయ సంప్రదాయంలో మెడలో మాలలు ధరించడం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. జీవన విధానంలో భాగంగా కూడా భావిస్తారు. రుద్రాక్ష, తులసి, చందనం, స్పటిక వంటి మాలలతో పాటు ఇటీవల కాలంలో కరుంగలి మాలపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే నమ్మకంతో చాలామంది ఈ మాలను ధరిస్తున్నారు. దీంతో మార్కెట్లో కరుంగలి మాలలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
వరంగల్‌లోని నేపాల్ రుద్రాక్ష ఎగ్జిబిషన్ స్టాల్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, కరుంగలి మాలను నల్లని ఎబోనీ (Ebony) వృక్షం మధ్యభాగంలోని గట్టి కలపతో తయారు చేస్తారు. ఈ వృక్షాలు ప్రధానంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక ప్రాంతాల్లో కనిపిస్తాయి. చెట్టు లోపలి భాగం సహజంగానే నల్లటి రంగులో, అత్యంత దృఢంగా ఉండటంతో దానిని చిన్న చిన్న పూసలుగా మలిచి, రంధ్రాలు చేసి మాలగా తయారు చేస్తారు.
డిమాండ్ పెరగడంతో మార్కెట్లో అసలైన కరుంగలి మాలలతో పాటు నకిలీ మాలలు కూడా విస్తృతంగా విక్రయిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని సులభమైన పరీక్షల ద్వారా ఒరిజినల్ మాలను గుర్తించవచ్చు. ముందుగా మాలలోని ఒక పూసను తీసి నీటిలో వేస్తే, అసలైన పూస బరువు కారణంగా అడుగున మునుగుతుంది. నకిలీ పూసలు మాత్రం తేలికగా ఉండి నీటిపై తేలే అవకాశం ఉంటుంది.
మరో పరీక్షగా మాలను తెల్లటి గుడ్డపై లేదా కాగితంపై గట్టిగా రుద్దాలి. అసలైన కరుంగలి మాల రంగు వదలదు. ఒకవేళ నల్లటి రంగు గుడ్డపై పడితే అది రంగు వేసిన నకిలీ మాల అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పూసను సూదితో స్వల్పంగా గీసి చూస్తే లోపల కూడా నల్లటి రంగే కనిపించాలి. బయట మాత్రమే నలుపు రంగు ఉండి లోపల సాధారణ చెక్క కనిపిస్తే అది అసలైన కరుంగలి కాదు.
కరుంగలి మాలను ధరించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే మాలను ధరించడం మంచిదని చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు, క్షౌరం చేయించుకునే సమయంలో, అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు మాలను తొలగించాలని సూచిస్తున్నారు. అలాగే మాంసాహారం తీసుకునే సమయంలో లేదా మద్యం సేవించే సమయంలో ఈ మాలను ధరించకుండా ఉండటం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు.
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కరుంగలి మాలను ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని చెబుతారు. శరీరంలో అధిక వేడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని, కుజ దోష ప్రభావాన్ని తగ్గించడంలో, చెడు దృష్టి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో ఈ మాల ఉపయోగపడుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. అయితే ఇవి సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడిన వాదనలు మాత్రమే. ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Warangal,Telangana
