Last Updated:
EPFO Pension: PF అకౌంట్ ఉన్నవారికి కేంద్రం వరుస గుడ్ న్యూస్ లు చెబుతోంది. తాజాగా మరో భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈసారి ఏకంగా పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.3000లకు పెంచనుందట.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సభ్యులకు వరుసగా సంచలన మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే పీఎఫ్ వేతన పరిమితిని పెంచిన మోదీ సర్కార్.. తాజాగా వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటుగా ఉద్యోగులకు మరీ కీలక శుభవార్త అందించడానికి కూడా కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే కేంద్రం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది మరోవైపు ఉద్యోగుల పింఛను పథకం (EPS) కింద ప్రస్తుతం అందిస్తున్న కనీస నెలవారీ పింఛనును రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
ప్రస్తుతం ఈపీఎస్ కింద అర్హులైన పింఛనుదారులకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ అందుతోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో ఈ మొత్తం సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కేంద్రాన్ని ఆ మొత్తాన్ని పెంచాలంటూ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీస పింఛనును రూ.3,000కు పెంచే అంశంపై కార్మికశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ మధ్య సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనూ పలు ఉద్యోగ సంఘాలు పెన్షన్ ను రూ.7000లకు పెంచాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఇప్పటికీ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఆ కమీస ఫించను అనేది రూ.3000లకు పెంపు అనేదానిపై కూడా కేంద్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు. కేంద్రం దృష్టిలో ఉందనే వదంతు మాత్రమే.
ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే పింఛను పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిని ప్రతిపాదనగానే చూడాలి. దేశవ్యాప్తంగా సుమారు 81.48 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉండగా.. వీరిలో దాదాపు 73.55 లక్షల మంది నెలకు రూ.3,000 కంటే తక్కువ పింఛను పొందుతున్నట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ప్రతిపాదన అమలైతే వీరికి ప్రయోజనం కలగనుంది.
మరోవైపు ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్ సభ్యత్వానికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. 2026 సెప్టెంబర్ 17 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. దీంతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే అర్హులైన మరో 51 లక్షల మంది ఉద్యోగులకు పీఎఫ్, పింఛను, బీమా ప్రయోజనాలు అందే అవకాశం ఏర్పడింది. అంతేకాదు, వర్తించే నిబంధనల ప్రకారం ఈపీఎస్‌కు యజమాని చేసే 8.33 శాతం గరిష్ఠ వాటా రూ.1,250 నుంచి రూ.2,083కు పెరగనుంది. అయితే వేజ్ సీలింగ్ పెరిగిందని ఇప్పటికే పింఛను పొందుతున్న వారందరికీ ఆటోమేటిక్‌గా రూ.3,000 పింఛను వస్తుందని భావించకూడదు.
నవంబర్ 1న ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించారు. ఇకపై సభ్యులు ఈపీఎఫ్‌వో కార్యాలయాలకు వెళ్లకుండానే కొన్ని సేవలను మొబైల్లో పొందవచ్చు. ఈ సేవల ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. చివరిగా జరిగిన ఐదు లావాదేవీల వివరాలు చూడొచ్చు. పీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో అధికారిక వాట్సాప్ నంబర్ +91 87964 41800కు ‘Hi’ అని మెసేజ్ పంపి, సూచనలను అనుసరించాలి. అందుబాటులో ఉన్న భాషల్లో నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. మరో కీలక నిర్ణయంగా ఆధార్ ధ్రువీకరణ పూర్తయి, రూ.1,000 వరకు నిల్వ ఉన్న అర్హమైన ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే విధానాన్ని కూడా ఈపీఎఫ్‌వో ప్రారంభించింది. అవసరమైన గుర్తింపు, బ్యాంకు ఖాతా ధ్రువీకరణ పూర్తయ్యాక సభ్యులు ప్రత్యేకంగా క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.

