Last Updated:
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషాద క్షణాలను సోనియా గాంధీ తన తాజా ఆత్మకథ ‘బిలాంగింగ్’లో గుర్తుచేసుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిలో కుప్పకూలిన తనను కూతురు ప్రియాంక గాంధీ ఎలా ఓదార్చిందో భావోద్వేగంగా వివరించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన నూతన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో తన భర్త, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతం నాటి విషాద క్షణాలను అత్యంత భావోద్వేగంగా పంచుకున్నారు. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఎన్నికల ప్రచార సభలో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి జరగడంతో 10 జన్పథ్ నివాసంలో చోటుచేసుకున్న భయానక వాతావరణాన్ని ఆమె కళ్లకు కట్టారు. చెన్నై నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా బాంబు పేలుడు విషయం తెలియగానే 19 ఏళ్ల కూతురు ప్రియాంక గాంధీ పరుగున తన వద్దకు వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
ప్రియాంక గొంతులోని భయాన్ని చూడగానే తాను తీవ్ర ఆందోళనతో ఊపిరాడక అచేతనంగా నిలిచిపోయానని, ఆ క్షణంలో తన భర్త వెంట ప్రచారానికి ఎందుకు వెళ్లలేదంటూ కుప్పకూలి కన్నీరుమున్నీరైనట్లు సోనియా ఆ పుస్తకంలో వెల్లడించారు.
ఆ భయానక రాత్రి ఎంతటి తీవ్ర విషాదం ముంచెత్తినా 19 ఏళ్ల ప్రియాంక గాంధీ తల్లి ముందు ఒక్క కన్నీటిబొట్టు కూడా రాల్చకుండా కొండంత ధైర్యాన్ని ప్రదర్శించింది. తల్లిని ఒళ్లోకి తీసుకుని ఓదారుస్తూనే ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుంది. సీనియర్ రాజకీయ నాయకులకు అర్ధరాత్రి ఫోన్లు చేయడం, చెన్నై వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చూసుకోవడం వంటి పనులను క్షణాల్లో చక్కబెట్టింది. రాజీవ్ చనిపోయారన్న అధికారిక సమాచారం వచ్చినప్పుడు సోనియా కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లి కంటికి రెప్పలా కాపాడుకుంది.
ఆ సమయంలో అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న రాహుల్ గాంధీకి ఈ దుర్వార్తను చేరవేయడం కుటుంబానికి అత్యంత కష్టంగా మారింది. కుటుంబ సన్నిహితుడు ఒకరు రాహుల్‌కు ఫోన్ చేసి మాట్లాడగానే, అవతలి వ్యక్తి అసలు విషయం చెప్పకముందే రాహుల్ స్పందిస్తూ.. “నాన్నా చనిపోయారు కదా?” అంటూ హృదయవిదారకంగా ప్రశ్నించారు.
నిజానికి ఆరోజు శ్రీపెరంబుదూర్ సభలో రాజీవ్ గాంధీ పక్కనే రాహుల్ కూడా ఉండాల్సి ఉందని, చివరి నిమిషంలో ప్రయాణం రద్దు కావడంతో ప్రాణాపాయం తప్పిందని సోనియా తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఆ రాత్రి తమ కుటుంబం అనుభవించిన వేదనను, ప్రియాంక ప్రదర్శించిన అసమాన ధైర్యాన్ని ఈ జ్ఞాపకాలు ప్రతిబింబిస్తున్నాయి.

