Last Updated:
Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, విడాకుల అంశంపై సోషల్ మీడియా వేదికల్లో జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం పార్టీ (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వార్నింగ్ లాంటి ప్రకటనలు చేశాయి. ఈ వ్యవహారంలో తమ పార్టీ నాయకులు, ప్రతినిధులు, సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు ఎవరూ కూడా హద్దులు దాటి పోస్టులు పెట్టవద్దని, వ్యక్తిగత విషయాలపై చర్చల్లో పాల్గొనరాదని ఇరు పార్టీలు వేర్వేరుగా అధికారిక మార్గదర్శకాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత వ్యవహారాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతమ కేడర్, సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. వ్యక్తిగత విషయాలపై అనుచిత పోస్టులు, కామెంట్లు చేయొద్దంటూ ఇరు పార్టీలు వేర్వేరుగా అధికారిక ప్రకటనలను విడుదల చేశాయి.
మిత్రపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వ్యాఖ్యలు, చర్చలు చేయడం ఆమోదయోగ్యం కాదని ఐటీడీపీ (iTDP) స్పష్టం చేసింది. కూటమి పార్టీల నేతలతో పాటు వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి చర్చలు, వ్యాఖ్యలు చేయరాదు.ఐటీడీపీతో సంబంధం ఉన్న ఖాతాలు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తెలిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా వ్యక్తిగతంగా చేసే అనుచిత వ్యాఖ్యలు, అభిప్రాయాలతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం ఉండదు.”గౌరవం, సంయమనం, బాధ్యత” (Respect, Restraint, Responsibility) అనే సూత్రాలను పాటించాలని పిలుపునిచ్చింది.

ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియా వేదికల్లో వ్యాఖ్యలు, చర్చలు సాగుతున్న విషయాన్ని గుర్తించామని వైసీపీ పేర్కొంది. ఇది పూర్తిగా వ్యక్తిగత అంశం కాబట్టి సంబంధిత వ్యక్తుల ప్రైవసీని గౌరవించాలని, బహిరంగ వేదికల్లో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని తమ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కేడర్, సోషల్ మీడియా యాక్టివిస్టులకు స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి పోస్టులపై చర్చల్లో పాల్గొనడం గానీ, స్పందించడం గానీ చేయకూడదు.వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌నూ షేర్ చేయకూడదు, సర్క్యులేట్ చేయకూడదు.బహిరంగ సమాచార మార్పిడిలో ఎల్లప్పుడూ గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శించాలి. పార్టీ శ్రేణులు, ప్రతినిధులంతా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా గమనించి, తూచా తప్పకుండా పాటించాలని రెండు పార్టీల నాయకత్వాలు సూచించాయి.

