అందుకే శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చలికాలంలో అస్సలు ముట్టకూడని, పూర్తిగా దూరంగా ఉండాల్సిన ఏడు ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.
పచ్చి కూరగాయలు: దోసకాయలు, లెట్యూస్, టమాటాలు వంటి పచ్చి కూరగాయలు చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి. చలిని తట్టుకోవడానికి శరీరం ఇప్పటికే కష్టపడుతున్న సమయంలో పచ్చి పదార్థాలు జీర్ణక్రియను మందగింపజేస్తాయి. వీటి స్థానంలో వేడి సూప్‌లు, ఆవిరిపై ఉడికించిన కూరగాయలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.
చల్లని పాలు: వీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. పాలు పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, చల్లగా తాగితే గొంతులో కఫం పేరుకుపోతుంది. దగ్గు, జలుబు, ఛాతీలో పట్టేసినట్లు ఉండే సమస్యలు ఎక్కువవుతాయి. పాలు ఇష్టపడేవారు కొద్దిగా పసుపు, మసాలా దినుసులు కలిపి వేడిగా మరిగించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి నీళ్లు: ఇవి వేసవి తాపాన్ని తీర్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత తగ్గి చలి వణుకు పుట్టిస్తుంది. ఈ కాలంలో శరీరంలో నీటి శాతాన్ని కాపాడుకోవడానికి వేడి హెర్బల్ టీ, అల్లం టీ వంటి వేడి పానీయాలను తీసుకోవడం మంచిది.
పుచ్చకాయ, ఖర్బూజా వంటి పండ్లు: పండ్లలో కూడా కొన్ని రకాలు చలికాలానికి సరిపడవు. పుచ్చకాయ, ఖర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను చలికాలంలో తినకూడదు. ఇవి శరీరాన్ని అతిగా చల్లబరిచి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా విటమిన్లు సమృద్ధిగా ఉండే నారింజ, జామకాయ, ఆపిల్ వంటి సీజనల్ పండ్లను మాత్రమే ఎంచుకోవాలి.
వేపుడు పదార్థాలు: చలి వాతావరణంలో పకోడీలు, సమోసాలు వంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయితే మితిమీరి నూనె పదార్థాలు తింటే జీర్ణవ్యవస్థ నెమ్మదించడంతో పాటు బరువు వేగంగా పెరుగుతారు. నూనె తిండి రోగనిరోధక శక్తిని తగ్గించి సీజనల్ వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. వీటికి బదులు బేక్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవచ్చు.
పులియబెట్టిన పదార్థాలు: ఇడ్లీ, దోశ, డోక్లా వంటివి సాధారణంగా సులువుగా జీర్ణమవుతాయి. కానీ చలికాలంలో ఇవి కడుపులో ఎసిడిటీని పెంచుతాయి. శీతాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా మారడం వల్ల పులిసిన పదార్థాలు గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి. వీటిని వేసవి కాలంలో తిని, ప్రస్తుతానికి తాజా వేడి భోజనం చేయడం మంచిది.
పెరుగు: ఇది శరీరానికి సహజ శీతలీకరణిగా పనిచేస్తుంది. ఈ శీతల స్వభావం వల్ల చలికాలంలో పెరుగు తింటే కఫం, జలుబు లక్షణాలు తీవ్రమవుతాయి. పెరుగు ఇష్టపడేవారు కొద్దిగా జీలకర్ర పొడి కలిపి, లేదా కాస్త వేడిగా ఉండే మజ్జిగ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
