Last Updated:
El Nino Effect: చినుకు పడితేనే రైతన్నకు చేతి నిండా పని ఉండేది. అందుకే సీజన్ మొదలైతే అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తుంటారు. తొలకలి చినుకులు పడితే సాగు పనులు మొదలుపెట్టుకోవచ్చన్న చిరు ఆశతో ఉన్న రైతాంగానికి ఈసారి నిరాశే ఎదురైంది. మరీ ముఖ్యంగా ఎల్ నినోను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వరిసాగు చేసే రైతులకు మురుగు నీరే శరణ్యంగా మారింది.
El Nino Effect in Andhra: ప్రపంచ వ్యాప్తంగా ఏ విపత్తు, ఏ వినాశకర పరిస్థితులు తలెత్తినా తెలుగు రాష్ట్రాలే ఎక్కువ ప్రభావితం అవుతాయి. మరీ ముఖ్యంగా నేలను నమ్ముకొని సాము చేసే అంటే సాగు చేసే రైతన్నకు కష్టాలు ఎవరికి కనిపించవు. ఏదైనా మార్కెట్లో డిమాండ్ ఉందని అధిక సాగు చేస్తే గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర లేదని దిగుబడి తగ్గిస్తే అప్పుడు రెట్టింపు రేట్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో చూస్తూ ఆటుపోటులను తట్టుకొని సాగు చేద్దామంటే ఈసారి ఎల్‌నినోను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో చినుకు జాడ లేకుండాపోయింది. ఆగస్ట్ నెల సగం రోజులు గడిచినప్పటికి వర్షాలు లేకపోవడంతో రైతులు సాగు చేయడానికి చివరకు మురుగు కాలువ నీళ్లను పొలాల్లోకి మళ్లించాల్సిన దుస్థితి తలెత్తింది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని మురికి నీరు ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీరుగా మారడం రైతుల్నే కాదు సామాన్య ప్రజల్ని కూడా తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.
