Last Updated:
El Nino: వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే ‘ఎల్నినో’ పరిస్థితులు రానున్న ఐదేళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేయనున్నాయని అంతర్జాతీయ సంస్థ ‘ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్’ సంచలన నివేదిక విడుదల చేసింది.
‘బలమైన ఎల్నినో.. చెరిగిపోని నష్టాలు’ పేరిట విడుదల చేసిన ఈ అధ్యయన నివేదికలో ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2026 నుంచి 2031 మధ్య ఐదేళ్ల కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్థూలంగా 4 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, తక్కువ ఉత్పాదకత, ద్రవ్యోల్బణం కారణంగా జీడీపీ 1.8 నుంచి 2 శాతం మేర తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ఈ ఎల్నినో గతంలో వచ్చిన వాటికంటే అత్యంత తీవ్రంగా ఉండబోతోందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం ఆర్థిక నష్టంలో మూడింట రెండు వంతుల నష్టం కేవలం భారత్, చైనా, పాకిస్థాన్ మరియు ఆగ్నేయాసియా దేశాలకే పరిమితం కానుందని నివేదిక స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ధరల పెరుగుదల, వ్యాపార అనిశ్చితి ఏర్పడినా అవి కొన్నేళ్లలోనే కోలుకుంటాయని, కానీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం ఎక్కువ సంవత్సరాల పాటు కొనసాగుతుందని పేర్కొంది.
ఎల్నినో వల్ల ఏర్పడే కరవు పరిస్థితులు, విపరీతమైన వేడి గాలుల ప్రభావం గ్రామీణ, పేద కుటుంబాలపై అత్యధికంగా పడనుంది.
వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు, కూలీల ఆదాయం గణనీయంగా పడిపోతుంది. సరైన ఉపాధి, ఆదాయం లేకపోవడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం అప్పటివరకు దాచుకున్న పొదుపు సొమ్మును ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఆర్థిక పరిస్థితి మరింత దిగజారితే, సామాన్య కుటుంబాలు తమ వద్ద ఉన్న ఆస్తులను అమ్ముకునే ప్రమాదం కూడా పొంచి ఉందని అధ్యయనం హెచ్చరించింది.
ఎల్నినో కారణంగా ఒకవైపు తీవ్రమైన వేడి, కరవు పరిస్థితులతో పంటల దిగుబడి తగ్గిపోతుండగా, మరోవైపు అకాల వరదలు మౌలిక సదుపాయాలు, మూలధనాన్ని నాశనం చేస్తున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికుల పనిగంటలు తగ్గిపోయి, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా 2028 ప్రారంభం నాటికి ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేసింది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల 2027 నాటికి ప్రపంచ జీడీపీ 0.6 శాతం, 2028 నాటికి 0.8 శాతం మేర క్షీణించనుందని, గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది అతిపెద్ద ఆర్థిక విపత్తుగా నిలిచిపోనుందని నివేదిక విశ్లేషించింది.

