దోసకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు
ఈ పచ్చడి తయారు చేయడానికి ఒక మీడియం సైజు దోసకాయ, ఐదు నుంచి ఆరు వంకాయలు, నాలుగు టమాటోలు, 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఆరు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ఒక టీస్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. పోపు కోసం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ కూడా సిద్ధం చేసుకోవాలి.
పచ్చడి తయారు చేసే విధానం
ముందుగా దోసకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. విత్తనాలు ఎక్కువగా ఉంటే తీసేయవచ్చు. ఈ ముక్కలను ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి కొద్దిగా మెత్తబడిన తర్వాత చింతపండు, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. అనంతరం స్టవ్ ఆపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలపాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పచ్చడికి మంచి రుచి, సరైన ఆకృతి వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి.
చివరగా పోపు ఇలా పెట్టాలి
మరో చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. అవి కొద్దిగా రంగు మారిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపును దోసకాయ పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన దోసకాయ ముక్కల పచ్చడి సిద్ధం.
రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి
ఈ పచ్చడి కోసం మరీ పండిన టమాటోలు కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్నవాటిని తీసుకుంటే రుచి బాగుంటుంది. దోసకాయ ముక్కలను మిక్సీలో వేయకూడదు. అలా చేస్తే వాటి కరకరలాడే గుణం పోతుంది. కారం ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిర్చి పెంచుకోవచ్చు. వంకాయ ఇష్టం లేనివారు వాటి పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే దోసె, ఇడ్లీ, రోటీతో కూడా ఆస్వాదించవచ్చు.
