Last Updated:
మసాలాలు బాగా పట్టి, బయటకు కాస్త క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే బోటీ ఫ్రైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ దసరాకు రుచికరమైన బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
దసరా పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో పండుగ సందడి మొదలవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 20న దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా చాలామంది ఇళ్లలో ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో దసరా సమయంలో మటన్ కూర, చికెన్, బోటీ ఫ్రై, బ్రెయిన్ కర్రీ వంటి మాంసాహార వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిలో బోటీ ఫ్రై అంటే చాలామందికి ఎంతో ఇష్టం. మసాలాలు బాగా పట్టి, బయటకు కాస్త క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే బోటీ ఫ్రైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ దసరాకు రుచికరమైన బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బోటీ ఫ్రై తయారు చేయడానికి ముందుగా మటన్ బోటీని శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. బోటీపై ఎలాంటి మలినాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో బోటీ వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, అవసరమైనంత నీరు పోసి మెత్తగా ఉడికించాలి. బోటీ బాగా ఉడికిన తర్వాత దానిలోని నీటిని వేరుగా ఉంచుకోవాలి. ఈ నీటిని తర్వాత వంటలో ఉపయోగిస్తే కూరకు మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు బోటీ ఫ్రైకి అవసరమైన మసాలా పొడిని తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. మసాలాల నుంచి మంచి సువాసన వచ్చిన తర్వాత వాటిని చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడి బోటీ ఫ్రైకి ప్రత్యేకమైన రుచిని, సువాసనను అందిస్తుంది.
తర్వాత అదే కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ముందుగా ఉడికించిన బోటీ వేసి మసాలా మిశ్రమంలో బాగా కలపాలి.
ఇప్పుడు ముందుగా ఉడికించిన బోటీ నీటిని కొద్దికొద్దిగా పోస్తూ బోటీకి మసాలాలు బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న మసాలా పొడి, కారం వేసి మరోసారి బాగా కలపాలి. కడాయిపై మూత పెట్టి తక్కువ మంటపై కొద్దిసేపు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి. బోటీకి మసాలాలు బాగా పట్టి, ముక్కలు కొద్దిగా క్రిస్పీగా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
చివరగా కొత్తిమీర, పుదీనా చల్లితే వేడి వేడి బోటీ ఫ్రై సిద్ధమవుతుంది. కావాలనుకుంటే చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ బోటీ ఫ్రైని వేడి అన్నం, రొట్టెలు లేదా పప్పు చారుతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ దసరాకు మీ ఇంట్లో కూడా ఈ తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై తయారు చేసి కుటుంబ సభ్యులకు వడ్డించండి. బోటీని పూర్తిగా ఉడికించి, శుభ్రత పాటించడం మాత్రం మర్చిపోవద్దు.

