Last Updated:
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (KAAKA). తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (KAAKA). గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పండుగ వాతావరణంలో మెగాస్టార్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ లో సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.
చిరంజీవి, డైరెక్టర్ బాబీ కలయిక అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి బరిలో దిగిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. వింటేజ్ మెగాస్టార్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించి డైరెక్టర్ బాబీ మెగా అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ‘కాకా’ సినిమాపై అంచనాలు పీక్స్ లోకి చేరాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ముఠామేస్త్రి, ఖైదీ నెం.150, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ పండుగ సీజన్ లోనే వచ్చాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2027 సంక్రాంతికి ‘కాకా’ బరిలోకి దిగుతుండటంతో మరోసారి వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ రేంజ్, బాక్సాఫీస్ స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా అన్ కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శకుడు బాబీ స్వతహాగా చిరంజీవికి వీరాభిమాని కావడంతో, బాస్ ను మరోసారి మునుపెన్నడూ చూడని ఊర మాస్ అండ్ యాక్షన్ అవతార్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే, సినిమాపై హైప్ ను మరింత పెంచేందుకు మేకర్స్ అదిరిపోయే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి భార్యగా స్నేహ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే స్నేహ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.

