Last Updated:
ఇంట్లో చక్కెర పొంగలి చేసినప్పుడు కొన్నిసార్లు గుడిలో ప్రసాదంలా రుచి రావడం లేదని చాలామంది అనుకుంటారు. సరైన పద్ధతిలో బియ్యం ఉడికించడం, బెల్లం పాకం తయారు చేయడం, నెయ్యి తగినంతగా కలపడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే ఎంతో రుచికరమైన పొంగలిని తయారు చేసుకోవచ్చు.
మనలో చాలా మందికి చక్కెర పొంగలి అంటే ఎంతో ఇష్టం. పండగలు, పూజలు, శుభకార్యాల సమయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించే తీపి వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి కలిపి తయారు చేసే ఈ పొంగలి మంచి రుచితో పాటు చక్కని సువాసనను కూడా ఇస్తుంది. అయితే, ఇంట్లో చక్కెర పొంగలి చేసినప్పుడు కొన్నిసార్లు గుడిలో ప్రసాదంలా రుచి రావడం లేదని చాలామంది అనుకుంటారు. సరైన పద్ధతిలో బియ్యం ఉడికించడం, బెల్లం పాకం తయారు చేయడం, నెయ్యి తగినంతగా కలపడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే ఎంతో రుచికరమైన పొంగలిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ కమ్మటి చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు
ఈ పొంగలి తయారీకి ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు పంచదార తీసుకోవాలి. అలాగే తగినంత నెయ్యి, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా పచ్చ కర్పూరం, మూడు టేబుల్ స్పూన్ల తేనె, అవసరమైనంత నీటిని సిద్ధం చేసుకోవాలి. తేనె, పచ్చ కర్పూరం వంటివి మీ అభిరుచికి అనుగుణంగా పరిమితంగా ఉపయోగించుకోవచ్చు.
చక్కెర పొంగలి తయారీ విధానం
ముందుగా స్టౌపై ఒక కడాయి పెట్టి పెసరపప్పును వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. పప్పు నుంచి మంచి సువాసన వచ్చి, రంగు కొద్దిగా మారిన తర్వాత ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం, వేయించిన పెసరపప్పును ఒక గిన్నెలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత పెద్ద గిన్నెలో నాలుగు గ్లాసుల నీరు, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో బియ్యం, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించాలి. అన్నం సుమారు 90 శాతం ఉడికిన తర్వాత మంట తగ్గించాలి.
మరో గిన్నెలో గ్లాసున్నర నీరు పోసి, బెల్లం తురుము, పంచదార వేసి పూర్తిగా కరిగించాలి. బెల్లంలో మలినాలు ఉంటే పాకాన్ని వడకట్టాలి. అనంతరం ఈ పాకాన్ని మళ్లీ స్టౌపై పెట్టి కొద్దిగా చిక్కబడే వరకు వేడి చేయాలి. అందులో ఉడికించిన అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మీడియం మంటపై ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ పొంగలి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. అడుగున అంటుకోకుండా జాగ్రత్తగా కలపాలి.
పొంగలి చిక్కబడిన తర్వాత తగినంత నెయ్యి వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టౌ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత తేనె కలపాలి. చివరగా చిన్న గిన్నెలో నెయ్యి వేడి చేసి ఎండు కొబ్బరి ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి ఈ మిశ్రమాన్ని పొంగలిలో కలపాలి. యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే సువాసనతో కూడిన చక్కెర పొంగలి సిద్ధమవుతుంది.
పొంగలి వేడిగా ఉన్నప్పుడే నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే తేనెను వేడి తగ్గిన తర్వాతే కలపడం మంచిది. ఈ విధంగా ఇంట్లోనే సులభంగా కమ్మటి చక్కెర పొంగలిని తయారు చేసుకుని పండగలు, పూజల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి.

