Last Updated:
కన్నాట్ ప్లేస్‌లో ‘లెహ్రా దో తిరంగా’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ సెంట్రల్ పార్క్ మూసివేత కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వేదికగా శుక్రవారం సాయంత్రం చేపట్టదలచిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేతో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దిప్కేను ఝండేవాలాన్ ప్రాంతంలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకోగా, నేహా బోరాను మండి హౌస్ సమీపంలో నిర్బంధించారు. అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలో భారీ పోలీస్ బందోబస్తును దిప్కే తీవ్రంగా ప్రశ్నించారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఏ రకంగానూ నేరం కాదని, నిర్బంధాలకు భయపడేది లేదని ఇరువురు నేతలు తేల్చిచెప్పారు.
భారీ ప్రదర్శనకు పోలీసుల అనుమతి లేకపోవడంతో పాటు ఆ ప్రాంతంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు దిప్కేను ముందస్తుగా నిర్బంధించారు.
ప్రతిపాదిత నిరసన దృష్ట్యా కన్నాట్ ప్లేస్ ప్రాంతం భద్రతా వలయంగా మారింది. దాదాపు 6,000 మంది ఢిల్లీ పోలీసులు, సుమారు 26,000 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) పహారా కాస్తున్నాయి. వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల రక్షణ నిమిత్తం అక్టోబర్ 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను అధికారులు పూర్తిగా మూసివేశారు.
గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపి అరెస్టయిన తమ పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని వ్యతిరేకిస్తూ సీజేపీ ఈ పిలుపునిచ్చింది. మువ్వన్నెల జెండాను ఎగరేయడం నేరం కాదని, దేశ గౌరవం కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని దిప్కే పేర్కొన్నారు. కొద్దిమంది మాత్రమే నియంత్రిత ప్రదేశంలో జాతీయ జెండా ఊపుతూ గీతాలాపన చేసేందుకు సిద్ధమని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.
ఈ నిరసనల వల్ల పాలికా బజార్ సహా కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పండుగల సీజన్లో వినియోగదారుల రాక గణనీయంగా పడిపోయిందని వారు వాపోతున్నారు. అధికారులు నగరాన్ని స్తంభింపజేయడం వల్లే నష్టాలు వస్తున్నాయని, శాంతియుత నిరసనలతో కాదని దిప్కే గతంలో వ్యాఖ్యానించారు.

