Last Updated:
ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలపై వరుస కథనాలు.. చైనా గూఢచర్య అనుమానాలు.. చివరకు ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా! ఏఐ చిప్‌లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా కంపెనీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల తయారీలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, వివాహేతర సంబంధాలపై వెలువడిన వరుస కథనాలు ఈ పరిణామానికి దారితీశాయి. మొదట ఒక మహిళతో సంబంధం గురించి వార్తలు రాగా, ఆ తర్వాత కంపెనీలో ఉన్నత పదవిలో పనిచేస్తున్న మరో మహిళతో సంబంధం ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాజాగా మరో ఉద్యోగితోనూ ఆయనకు సంబంధం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. దీంతో ఈ వ్యవహారం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమెకు చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు తమకు ఆధారాలు లేవని బోర్డు స్పష్టం చేసింది. నవంబర్ 8న జెన్సన్ హువాంగ్ తన కుటుంబానికి, కంపెనీ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ, భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరించారు. అయితే తన ప్రకటనలో సంబంధం ఉన్న మహిళ పేరు వెల్లడించలేదు.
ఈ వివాదం కొనసాగుతుండగానే ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కింబర్లీ పావెల్‌తో జెన్సన్‌కు సంబంధం ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇద్దరూ వివాహితులేనని, 2026 మార్చిలో శాన్‌జోస్‌లో జరిగిన ఎన్విడియా జీటీసీ సమావేశం సమయంలో ఓ హోటల్‌లో సన్నిహితంగా కనిపించారని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలపై జెన్సన్, కింబర్లీ లేదా ఎన్విడియా నుంచి బహిరంగంగా స్పష్టమైన స్పందన రాలేదు.
నవంబర్ 12న రాయిటర్స్ ప్రచురించిన ప్రత్యేక కథనం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఎన్విడియాలో పనిచేసే మరో ఉద్యోగితోనూ జెన్సన్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ నివేదించింది. అయితే ఆ మహిళ పేరును వెల్లడించలేదు. ఈ మూడు సంబంధాలకు సంబంధించిన వార్తలు, కంపెనీ బోర్డు విచారణ నేపథ్యంలో జెన్సన్ తన పదవికి రాజీనామా చేశారు.
1993లో ఎన్విడియాను స్థాపించిన జెన్సన్ హువాంగ్, మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి నాయకత్వం వహించారు. గేమింగ్ గ్రాఫిక్స్ కార్డుల తయారీ సంస్థగా ప్రారంభమైన ఎన్విడియాను ఏఐ రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన రాజీనామా తర్వాత కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. శాశ్వత వారసుడి ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్లు సంస్థ ప్రకటించింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా నాయకత్వంలో భారీ మార్పుకు దారితీయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

