Last Updated:
Milk Price Hike | పాల ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ పాల సంస్థ మదర్ డెయిరీ లీటరు పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. ఈ కొత్త ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఏ రకం పాల ధర ఎంత పెరిగింది? కొత్త రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో నివసించే ప్రజలకు మరోసారి పాల ధరల భారం పడనుంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ లీటరు పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు ధర పెంచిందని పీటీఐ కథనం వెల్లడించింది. పెరిగిన ధరలు నవంబర్ 12, గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. పాలు సేకరించే ఖర్చులు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని సంస్థ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో అత్యధికంగా పాలు సరఫరా చేసే సంస్థగా మదర్ డెయిరీకి పేరుంది. ఈ సంస్థ చివరిసారిగా 2026 మే 14న పాల ధరలను పెంచింది. అంతకుముందు 2025 ఏప్రిల్‌లో ధరలను సవరించింది. తాజాగా మదర్ డెయిరీ విక్రయించే వివిధ రకాల ప్యాకెట్ పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచినట్లు సమాచారం. అయితే, ఈ ధరల పెంపుపై సంస్థ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
రైతుల నుంచి పాలు కొనుగోలు చేసేందుకు చెల్లించే ధరలు పెరిగాయని సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పెరిగిన ఖర్చులో కొంత భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చిందని వివరించాయి. మదర్ డెయిరీ తన పాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 75 నుంచి 80 శాతం వరకు రైతులకే చెల్లిస్తోంది. ఈ సంస్థ ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. సొంత పాల కేంద్రాలు, సాధారణ దుకాణాలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లను కలిపి చూస్తే రోజుకు 50 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తోంది.
ఎన్‌సీఆర్ ప్రాంతంలో కొత్త ధరలు చూస్తే టోన్డ్ మిల్క్ (బల్క్ వెండింగ్) ధర లీటరుకు రూ.58 నుంచి రూ.60కి పెరిగింది. ఫుల్ క్రీమ్ మిల్క్ (ప్యాకెట్ పాలు) ధర రూ.72 నుంచి రూ.76కి చేరింది. టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ పాలు) ధర లీటరుకు రూ.60 నుంచి రూ.62కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.54 నుంచి రూ.56కి చేరింది. ఆవు పాలు ధర లీటరుకు రూ.62 నుంచి రూ.65కి పెరిగింది. మరోవైపు, మదర్ డెయిరీ వ్యాపారం కూడా మంచి వృద్ధిని సాధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ టర్నోవర్ 17 శాతం పెరిగి రూ.20,300 కోట్లకు చేరింది. పాల ఉత్పత్తులు, వంట నూనెలకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 1974లో కార్యకలాపాలు ప్రారంభించిన మదర్ డెయిరీ.. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ)కి పూర్తిగా చెందిన అనుబంధ సంస్థ.
ఈ సంస్థ ‘మదర్ డెయిరీ’ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘ధారా’ బ్రాండ్ కింద వంట నూనెలను మార్కెట్ చేస్తోంది. తాజా పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ వెజిటబుల్స్, స్నాక్స్, పండ్ల గుజ్జు, కాన్సన్‌ట్రేట్స్ వంటి ఉత్పత్తులను ‘సఫల్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. మదర్ డెయిరీకి మొత్తం తొమ్మిది పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు, నాలుగు హార్టికల్చర్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వంట నూనెల వ్యాపారం కోసం మరో 16 అనుబంధ ప్లాంట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

