Last Updated:
మాస్క్ వేసి చోరీ.. వేషాలు మార్చి ఎస్కేప్.. కానీ పోలీసులకు ఆ కుర్రాడు ఎలా దొరికాడో తెలిస్తే మైండ్ బ్లాంకే!
సోషల్ మీడియాలో అతడో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్. పైకి చూస్తే ఎంతో భక్తిభావం కలవాడు.. దయాగుణం ఉన్న మంచివాడు. కానీ, తెర వెనుక మాత్రం పక్కా స్కెచ్‌తో దొంగతనాలు చేసే ఘనాపాటి. రీల్స్‌లో నీతులు చెప్పే ఈ యువకుడు రియల్ లైఫ్‌లో మాత్రం కదులుతున్న రైలులో ఓ వృద్ధురాలి నుంచి ఏకంగా 50 సవర్ల (400 గ్రాములు) బంగారాన్ని కొల్లగొట్టి కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన 38 ఏళ్ల బాలమురుగన్ అసలు బాగోతం బట్టబయలు కావడంతో స్థానికులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ప్రబుద్ధుడు రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఇంతటి భారీ చోరీకి పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ భారీ చోరీకి సంబంధించిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కుమారి అనే వృద్ధురాలు కుటుంబంలో జరిగే ఓ శుభకార్యం కోసం చెన్నైలోని తన కుమారుడి ఇంటి నుంచి కేరళలోని చెంగన్నూరుకు నవంబర్ 2న రైలులో బయలుదేరారు. ఆమె వెంట సుమారు 400 గ్రాముల బరువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. నవంబర్ 3వ తేదీన రైలు త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో బ్యాగును పరిశీలించిన ఆమెకు అందులో ఉండాల్సిన నగలు కనిపించలేదు. ఎవరో తన బ్యాగులోని బంగారాన్ని దోచుకెళ్లారని గ్రహించిన బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైటెక్ దొంగతనం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు వెంటనే దర్యాప్తును ముమ్మరం చేశారు. దొంగను పట్టుకునేందుకు వివిధ రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 600 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో గుర్తుపట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. సేలంలో రైలెక్కిన దొంగ.. పక్కా ప్రణాళికతో వృద్ధురాలి బ్యాగులోని నగలు చోరీ చేసి పాలక్కాడ్‌లో దిగిపోయాడు. అక్కడి నుంచి పోలీసుల కళ్లుగప్పేందుకు తన వేషధారణను పలుమార్లు మార్చుకున్నాడు. వేరే రైలు ఎక్కుతున్నట్లు నటించి పక్కదారి పట్టించడం, బస్సులు మారుతూ ప్రయాణించడం లాంటి జిమ్మిక్కులతో పోలీసులకు చెమటలు పట్టించాడు.

నిందితుడు ఎంత పకడ్బందీగా వ్యవహరించినా పాలక్కాడ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు అతడిని పట్టించేశాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ఇన్‌ఫ్లుయెన్సర్ బాలమురుగన్‌గా పోలీసులు పక్కాగా గుర్తించారు. దొంగతనం తర్వాత కూడా అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రావెల్ వ్లాగ్స్, రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అతడు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్న ఆ రీల్స్ లొకేషన్లే పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. సోషల్ మీడియాలో అతడి యాక్టివ్‌నెస్ అతడి పాలిట శాపంగా మారి చివరకు పోలీసులకు చిక్కేలా చేసింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ట్రాక్ చేసిన అధికారులు అతడి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వల పన్నారు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పక్కా సమాచారం సేకరించిన పాలక్కాడ్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. నవంబర్ 11వ తేదీన కోయంబత్తూరులో దొంగిలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా బాలమురుగన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. సమాజంలో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, ఎప్పుడూ దైవచింతనతో గడిపే యువకుడు ఇలాంటి దారుణమైన దొంగతనానికి పాల్పడ్డాడన్న నిజం తెలిసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. అతడి చీకటి కోణం బయటపడటంతో స్థానికులు సైతం షాక్‌లో ఉండిపోయారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. అతడి వద్ద నుంచి దొంగిలించిన మొత్తం బంగారాన్ని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

